Pandu Master | ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘ఢీ’ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పండు మాస్టర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఆయన అభిమానులు, బుల్లితెర ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మానవత్వం చాటుతూ పండు మాస్టర్‌కు అండగా నిలిచారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఆయన పండు మాస్టర్ సన్నిహితులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పండు మాస్టర్ చికిత్సకు అయ్యే ఖర్చు గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే పల్లా సూచించినట్లు తెలుస్తోంది. అవసరమైతే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, డాక్టర్లతో తాను కూడా మాట్లాడతానని ఆయన భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే స్పందనపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ ఆయన మానవత్వాన్ని కొనియాడుతున్నారు.
మరోవైపు పండు మాస్టర్ ప్రమాదం పట్ల సినీ, బుల్లితెర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. అవసరమైన సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పలువురు సన్నిహితులు పేర్కొంటున్నారు. అయితే ప్రమాదానికి కోళ్ల వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే కారణమై ఉండొచ్చని ప్రాథమిక విచారణలో పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే వాహనం స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగిందని వ్యాన్ డ్రైవర్ చెబుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలో పండు మాస్టర్ తీవ్రంగా గాయపడటంపై అతడు కూడా విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
విశాఖలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక సమాచారం వెల్లడించారు. ఆయన రెండు కాళ్లకు శస్త్రచికిత్స అవసరమైందని తెలిపారు. ఇప్పటికే నడుము కింద భాగంలో జాయింట్ డిస్లొకేషన్ సమస్యను సర్జరీ ద్వారా సరిచేసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని, శస్త్రచికిత్స అనంతరం కనీసం ఆరు నెలలు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని వైద్య బృందం తెలిపింది. అనంతరం మళ్లీ సాధారణ జీవితంతో పాటు డ్యాన్స్ కార్యక్రమాలను కూడా కొనసాగించవచ్చని వారు పేర్కొన్నారు. ఈ వార్తతో పండు మాస్టర్ అభిమానులు కాస్త ఊరట చెందుతున్నారు.