Pak Ceasefire | గత కొద్ది రోజులుగా బోర్డర్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో మనం చూస్తూ ఉన్నాం. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మన జవాన్లు కొందరు కన్ను మూశారు. అయితే భారతదేశం-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే మళ్లీ పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. దీంతో భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్ వంటి ప్రధాన పాకిస్తాన్ నగరాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం ప్రతీకార దాడులు నిర్వహించింది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే పాక్ తన వక్ర బుద్ది ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్.. అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో దాడులకు దిగింది. అయితే దానిని భారత సైన్యం సమర్ధంగా ఎదుర్కొంది.
అయితే పాక్ వక్ర బుద్ధిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో ‘లక్ష్య’ సినిమాలోని ఒక సీన్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సీన్లో పాకిస్తాన్ నిజస్వరూపం ఏంటో ఓం పురి చెబుతారు. లక్ష్య చిత్రం 2004లో విడుదల కాగా, ఇందులోని ఓ సీన్లో ఓం పురి, హృతిక్ రోషన్ నటించారు. ఓం పురి, హృతిక్‌తో “పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోతే మళ్ళీ వస్తారు… గెలిచాక నిర్లక్ష్యం వద్దు… నా మాట గుర్తుపెట్టుకో” అని చెప్పగా, దానికి హృతిక్ “గుర్తుపెట్టుకుంటా” అని అంటాడు. ఇప్పుడు ఈ సీన్‌ని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడు జరిగింది ఓం పురికి ముందే తెలుసు” అని ఒకరు కామెంట్ చేస్తే, మరికొందరు.. కాల్పుల విరమణ బాగానే ఉంది కానీ ఓం పురి మాటలు మర్చిపోవద్దు అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు 2004లోనే లక్ష్య సినిమాతో పాక్‌ని నమ్మోద్దని ఓం పురి చెప్పారని అన్నారు.
లక్ష్య సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం 18 జూన్ 2004న విడుదలైంది. జావేద్ అక్తర్ కథ, మాటలు రాస్తే, ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం ఈ చిత్రానికి వహించారు. హృతిక్, ఓం పురితో పాటు అమితాబ్, ప్రీతి జింటా, బోమన్ ఇరానీ ఈ చిత్రంలో నటించి మెప్పించారు. ఈ చిత్రం 1999 కార్గిల్ యుద్ధం నేపథ్యంలో రూపొందింది. మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచింది.