తెలుగు సినీరంగంలో యాభైఏళ్లుగా సుదీర్ఘ నట ప్రస్థానాన్ని సాగిస్తూ చిరస్మరణీయమైన విజయాలను సాధించిన అగ్ర నటుడు బాలకృష్టకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం దక్కడంతో తెలుగు సినిమా యావత్తు ఆనందం వ్యక్తం చేసింది. శనివారం కేంద్రప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి కళల విభాగంలో సినీరంగం నుంచి బాలకృష్ణ, తమిళ అగ్ర హీరో అజిత్, కన్నడ నటుడు అనంత్‌నాగ్, సీనియర్ కథానాయిక శోభన, దర్శకనిర్మాత, నటుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ అవార్టులు వరించాయి.
Padma Awards | యాభైఏళ్ల సుదీర్ఘ నటప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు బాలకృష్ణ. ‘తాతమ్మ కల’ (1974) చిత్రం ద్వారా బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. ’సాహసమే జీవితం’(1984) చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. పి.వాసు దర్శకుడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అదే ఏడాది వెంటవెంటనే ’డిస్కోకింగ్’ ’జననీ జన్మభూమి’ రూపంలో మరో రెండు ఫ్లాపులు. హీరోగా హ్యాట్రిక్ ఫ్లాపులతో బాలకృష్ణ కెరీర్ మొదలైంది. అదే ఏడాది విడుదలైన ’మంగమ్మగారి మనవడు’ బాలయ్యకు మరువలేని విజయాన్ని అందించింది. ఇక అక్కడ్నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా ’1986’ బాలకృష్ణ కెరీర్లో మెమరబుల్ ఇయర్. ఆ ఏడాది ఆయన నటించిన ఆరు సూపర్ హిట్లు విడుదలయ్యాయి.
ఒకే ఏడాది ఆరు విజయాలు. నేటి హీరోల్లో ఎవరికీ లేని రికార్డ్ ఇది. స్టార్ హీరోగా దూసుకుపోతూ.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు బాలకృష్ణ, ముఖ్యంగా 80ల్లో ఆయన నటించిన మంగమ్మగారి మనవడు, ముద్దులకృష్ణయ్య, సీతారామకల్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, మువ్వగోపాలుడు, భలేదొంగ, ముద్దులమావయ్య చిత్రాలు అప్పటి యువతనేకాక, కుటుంబ ప్రేక్షకుల్ని కూడా విశేషంగా అలరించాయి. అప్పటికే ఊరమాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్న బాలకృష్ణ తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా.. ఒక్క ఫైటు లేకుండా ’నారినారి నడుమ మురారి’ అనే పూర్తిస్థాయి రొమాంటిక్ క్లాసిక్ హీరోగా నటించి, తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ’లారీడ్రైవర్’ బాలకృష్ణ కెరీర్లో మేలి మలుపు. ఆ సినిమాలో ఓ కొత్త బాలయ్యను ప్రేక్షకులు చూశారు.
ఇక బాలకృష్ణ కీర్తికిరీటంలో కలికితురాయి లాంటి సినిమా అంటే.. వెంటనే గుర్తొచ్చే సినిమా ’ఆదిత్య 369’. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రం బాలయ్యకు ఓ గౌరవాన్ని తెచ్చిపెట్టింది. సింగీతం దర్శకత్వంలోనే ఆయన నటించిన మరో సినిమా ’భైరవద్వీపం’. బాలయ్యలోని విలక్షణ నటనకు నిదర్శనంగా నిలిచిందా సినిమా. ఇక 90ల్లో వచ్చిన రౌడీ ఇన్సెక్టర్ బొబ్బిలిసింహం, వంశానికొక్కడు, పెద్దన్నయ్య చిత్రాలు మాస్ హీరోగా బాలకృష్ణను మరోస్థాయిలో నిలబెట్టాయి. ’సమరసింహారెడ్డి (1999)తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులనే తిరగరాశాడు. ’నరసింహనాయుడు’(2001) బాలయ్య కెరీర్లో మరో మైల్స్టోన్. సినిమా వందరోజులు ఆడటమే గొప్ప అనుకునే రోజుల్లో.. 105 కేంద్రాల్లో వందరోజులు ఆడి, ఇండస్ట్రీ నివ్వెరపోయే విజయాన్ని సాధించారు బాలకృష్ణ.
’శ్రీతిరుపతి వెంకటేశ్వర కల్యాణం’ సినిమాలో నారదునిగా, దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాటపర్వం చిత్రాల్లో అభిమన్యునిగా, బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో హరిశ్చంద్రుడు, దుష్యంతుడిగా (ద్విపాత్రాభినయం), శ్రీకృష్ణార్జునవిజయంలో కృష్ణుడు, అర్జునుడిగా (ద్విపాత్రాభినయం), బాపు శ్రీరామరాజ్యంలో శ్రీరాముడిగా అద్భుతమైన నటన కనపరిచారు బాలకృష్ణ. ఇవన్నీ ఆయన నటించిన పౌరాణిక చిత్రాలు కాగా, వేములవాడ భీమకవిలో భీమకవిగా, అక్బర్ సలీం అనార్కలిలో సలీంగా, శ్రీపోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్రలో సిద్దప్పగా, గౌతమీపుత్ర శాతకర్ణిలో శాతకర్ణిగా అనితర సాధ్యమైన నటన కనపరిచారు బాలయ్య. ఇవన్నీ ఆయన నటించిన చారిత్రాత్మకాలు. ఇక బాలయ్య నటించిన ఏకైక జానపదచిత్రం ’భైరవద్వీపం’. ఇది అఖండ విజయాన్ని సాధించింది. బాలకృష్ణ నటించిన సైన్స్‌ఫిక్షన్ ‘ఆదిత్య 369’. ఇది ఆయన కెరీర్లోనే క్లాసిక్‌గా నిలిచింది. ఇక భక్తిరసాత్మక చిత్రమైన ’పాండురంగడు’లో భక్తునిగా, భగవంతునిగా నటించి రికార్డు సృష్టించారు బాలకృష్ణ.
తమిళ హీరో అజిత్‌ది విలక్షణ వ్యక్తిత్వం. సినిమాలతో పాటు రేసింగ్‌ను కూడా అంతే ఇష్టపడుతుంటారు. స్టార్డమ్, కలెక్షన్స్ గురించి అస్సలు పట్టించుకోరు. . ఇప్పటికి అరవైకి పైగా చిత్రాల్లో నటించగా..వాటిలో అత్యధిక చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్సే కావడం హీరోగా అజిత్ స్థాయి ఏమిటో తెలియజేస్తాయి. 90వ దశకంలో రొమాంటిక్ హీరోగా మొదలై నేటి యాక్షన్ హీరోగా ఆయన ప్రస్థానంలో ఎన్నో ఆసక్తికరమైన మలుపులున్నాయి. అజిత్ సికింద్రాబాద్‌లో జన్మించారు. అయితే ఆయన తండ్రి సుబ్రమణిది కేరళ మూలాలున్న కుటుంబం. సుబ్రమణి ఉద్యోగరీత్యా కొంతకాలం సికింద్రాబాద్‌లో ఉన్నారు. ఆ సమయంలోనే అజిత్ జన్మించారు. ఆయనకు ఏడాదిన్నర వయసులో వారి కుటుంబం చెన్నైకి వెళ్లి స్థిరపడింది. ‘ఎన్ వీడు ఎన్ కనవర్’ (1990) చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అజిత్.
తమిళ చిత్రం ‘అమరావతి’ (1993) ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు. ‘ప్రేమపుస్తకం’ చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయమయ్యారు. ‘ఆశై’ ‘కాదల్ కోైట్టె’ (తెలుగులో ‘ప్రేమలేఖ’), వాలి సినిమాలు అజిత్ కెరీర్ ఆరంభంలో సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. అమర్కలమ్, దీనా, సిటిజన్, వరలారు, బిల్లా, మన్కతా, ఉల్లాసం, కందు కొండైన్ కందుకొండైన్, ఆరంభం, వేదాళం, వివేగం, విశ్వాసం..ఇలా వరుస విజయాలతో అగ్ర హీరోగా ప్రస్థానం సాగిస్తున్నారు. అజిత్‌కు తమిళనాట అసంఖ్యాకమైన అభిమాన గణం ఉంది. హీరో విజయ్, అజిత్ అభిమానుల మధ్య తమిళనాట ఫ్యాన్వార్ అందరికీ తెలిసిందే. కెరీర్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న రోజుల్లోనే అజిత్ 2011లో తన ఫ్యాన్ క్లబ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తన పేరును రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారనే ఉద్దేశ్యంతో అజిత్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అభిమానులు తనకు ఇచ్చిన ‘తల’ (నాయకు డు) అనే బిరుదును కూడా త్యజించారాయన.
80, 90 దశకంలో యువత కలల రాణిగా భాసిల్లారు కథానాయిక శోభన. ఘనమైన సంప్రదాయ నృత్య నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె అభినయం, నృత్యం మేలికలయికగా వెండితెరపై మరపురాని పాత్రల్లో ప్రేక్షకుల్ని రంజింపజేశారు. కళ్లతోనే సమస్త హావభావాల్ని కనబరిచే నేర్పు, మనోహరమైన ముఖారవిందంతో ఆనాటి యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో వివిధ భాషల్లో దాదాపు 230లకు పైగా చిత్రాల్లో నటించారు. 1980లో బాలనటిగా ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. ‘మంగళ నాయగి’ అనే తమిళ చిత్రంలో ఉత్తమ బాలనటిగా అవార్డును గెలుచుకున్నారు. మలయాళ చిత్రం ‘ఏప్రిల్ 18’ (1984) ద్వారా కథానాయికగా అరంగేట్రం చేశారు. ఇక అక్కడి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నటనతో పాటు నాట్యకారిణిగా దేశవిదేశాల్లో అద్భుత ప్రదర్శనలతో మెప్పించారు. ఆమె నటించిన తొలి తెలుగు సినిమా ’విక్రమ్'(1986).
అక్కినేని నాగార్జున తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఆ తర్వాత తెలుగులోని అగ్రహీరోలందరితో జతకట్టి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అభినందన, దళపతి, ఏప్రిల్ 1 విడుదల, మువ్వగోపాలుడు, నారివారి నడుమ మురారి, రౌడీ అల్లుడు, అల్లుడు గారు చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో శోభన నలభైకి పైగా చిత్రాల్లో నటించారు. తొంభై దశకంలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగారు. మలయాళంలో తాను చేసిన ’మణిచిత్రతాజు’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకున్నారు ఆ తర్వాత ‘మిత్ మై ఫ్రెండ్’ అనే ఇంగ్లీష్ చిత్రానికిగానూ ఉత్తమ నటిగా రెండోసారి జాతీయ పురస్కారం గెలుచుకున్నారు. తన జీవితాన్ని నాట్యానికే అంకితం చేశారు శోభన. ఈ కారణంగా వివాహానికి కూడా ఆమె దూరం అయ్యారు.
కన్నడ నటుడు అనంత్‌నాగ్ థియేటర్ ఆర్టిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కన్నడ, కొంకణి, మరాఠి, హిందీ భాషల్లో ఎన్నో నాటకాలను వేసిన ఆయన కన్నడ చిత్రం ‘సంకల్ప’ (1973) ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రానికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. అయితే శ్యామ్‌బెనగల్ దర్శకత్వంలో వచ్చిన ‘అంకుర్’ (1974) చిత్రంతో సమాంతర సినిమాల వైపు మళ్లారు. శ్యామ్ బెనగల్ డైరెక్ట్ చేసిన ‘మంథన్’ ‘ ‘కొండుర’ ‘కల్యుగ్’ చిత్రాల్లో కీలక పాత్రల్ని పోషించారు. కన్నడంతో పాటు హిందీ, మరాఠి, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ‘కేజీఎఫ్-1’ చిత్రంలో రచయిత పాత్ర ద్వారా నేటితరం ప్రేక్షకుల్లో గుర్తింపును పొందారు. తెలుగులో ‘శాంతి క్రాంతి’ ‘శంఖారావం’ ‘భీష్మ’ చిత్రాల్లో ముఖ్య పాత్రల్ని పోషించారు. ‘గోది బన్న సాధారణ మైకట్టు’ ‘గాలిపట’ వంటి కన్నడ చిత్రాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి.
నటుడిగా, దర్శకుడిగా భారతీయ సినీరంగంపై తనదైన ముద్రను వేశారు శేఖర్ కపూర్. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఖాన్దాన్’ సీరియల్ ద్వారా నటుడిగా వెలుగులోకి వచ్చారు. క్లాసిక్ చిత్రం ‘మాసూమ్’తో (1983) దర్శకుడిగా పరిచయమయ్యారు. నసీరుద్దిన్షా, షబానా ఆజ్మీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం దర్శకుడిగా శేఖర్‌కపూర్‌కు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ తర్వాత సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘మిస్టర్ ఇండియా’ చిత్రంతో అన్ని వర్గాలకు చేరువయ్యారు. అయితే బందీపోటు పూలన్ దేవి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘బాండిట్ క్వీన్’ (1994) శేఖర్ కపూర్‌కు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చి పెట్టింది. కేన్స్, ఎడిన్బర్గ్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో విమర్శకుల ప్రశంసలందుకొంది. ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన పీరియాడిక్ డ్రామా ‘ఎలిజబెత్’ ఏడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్ సాధించింది.