టారో
నెట్‌ఫ్లిక్స్: స్ట్రీమింగ్ అవుతున్నది
నటీనటులు: అవంతిక వందనపు, జాకబ్ బాటలాన్, హారియెట్ స్లేటర్
దర్శకుడు: స్పెన్సర్ కోహెన్, అన్నా హాల్బర్గ్
OTT | కామెడీ, రొమాన్స్ జానర్ సినిమాలను ఒక్కో వర్గం ప్రేక్షకులు ఇష్టపడతారు. ఎక్కువమంది ప్రేక్షకులు చూడడానికి ఆసక్తి కనబరిచేది మాత్రం హారర్ చిత్రాలే. టాలీవుడ్ టు హాలీవుడ్ హారర్ సినిమాలు ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తాయి. దయ్యాల కథలకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన హారర్ సినిమా ‘టారో’ (Tarot) రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నది.
కథ ఏంటంటే..: కొందరు స్నేహితులు వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి మారుమూల ప్రాంతంలోని ఒక ఇంటికి వెళతారు. అక్కడ వారికి కనిపించిన పెట్టెలో టారో కార్డులు ఉంటాయి. ఆ బృందంలోని ఒక అమ్మాయి, టారో కార్డుల ఆధారంగా మిగిలిన స్నేహితుల భవిష్యత్తు చెబుతుంది. వారు ఎలా పుట్టారు, ఎలా మరణిస్తారు అనే విషయాలను తెలియజేస్తుంది.
టారో కార్డుల ప్రకారం చెప్పిన భవిష్యత్తు నిజమైందా? వాటి కారణంగా స్నేహితులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు..? అనేది అసలు కథ. బ్రహ్మోత్సవం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అవంతిక వందనపు ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించింది. తెలుగుతోపాటు పలు భాషల సినిమాల్లో నటించిన అవంతిక.. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లో సత్తాచాటుతున్నది. జాకబ్ బాటలాన్, హారియెట్ స్లేటర్ సహా నటీనటులు పాత్ర పరిధిమేరకు మెప్పించారు. హారర్ జానర్ సినిమాలను ఇష్టపడేవారికి టారో సినిమా తప్పక నచ్చుతుంది.