Operation Sindoor | గత కొద్ది రోజులుగా భారత్- పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు కన్ను మూయడంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో దాదాపు 60 మందికి పైగా ఉగ్రవాదులు కన్నుమూసారు. అయితే ఆపరేషన్ సిందూర్‌పై సినీ ప్రముఖులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇండియా చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి సినిమా తీయాలని ఫిలిం ఇండస్ట్రీలో పోటీ మొదలైంది. బాలీవుడ్ అంతా ఆపరేషన్ సిందూర్‌పై ఫోకస్ చేసింది. ఆ టైటిల్ కోసం ఏకంగా 15 స్టూడియోల మధ్య యుద్ధం జరుగున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ పేరు దేశవ్యాప్తంగా భావోద్వేగాన్ని రేకెత్తించగా, సినిమా నిర్మాతలు దీనిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో స్టూడియోస్, ముఖేశ్ అంబానీ నేతృత్వంలో మే 7న ఈ పేరును ట్రేడ్‌మార్క్ చేసేందుకు మొదటి దరఖాస్తు సమర్పించింది. ముంబై నివాసి ముఖేశ్ చేత్రం అగర్వాల్, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి కమల్ సింగ్ ఒబెరాయ్, ఢిల్లీకి చెందిన న్యాయవాది అలోక్ కొఠారీ కూడా ఈ టైటిల్ కోసం దరఖాస్తు చేశారు.ఈ సమయంలో ఒక ఫిలిం మేకర్ సినిమా ప్రకటన కూడా చేస్తూ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు మేకర్స్ పై విరుచుకుపడ్డారు. యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో సినిమా ప్రకటన చేయడం సిగ్గుచేటని అన్నారు.
విరల్ భయాని అనే పేజీలో ఈ సినిమా పోస్టర్ షేర్ చేయగా, ఇందులో ‘ఆపరేషన్ సింధూర్’ అనే టైటిల్ పైన ‘భారత్ మాతా కీ జై’ అని రాసి ఉంది. టైటిల్ కింద ఆర్మీ యూనిఫామ్ లో ఒక నటి చేతిలో గన్ పట్టుకుని, నుదుటన సింధూరం పెట్టుకుంటున్నట్టు కనిపించింది. బ్యాక్‌గ్రౌండ్‌లో బార్డ్ర్ దాటి జరుగుతున్న బాంబు దాడుల సీన్ కనిపించింది. ఇండియా చేసిన ధైర్య సాహసాలతో కూడిన ‘ఆపరేషన్ సిందూర్’ సినిమా కోసం నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్, ది కంటెంట్ ఇంజనీర్ కలిసి పనిచేస్తున్నారు అంటూ పోస్టర్ షేర్ చేశారు. దీనికి ఉత్తమ్ మహేశ్వరి, నితిన్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. నటీనటుల గురించి ఇంకా సమాచారం లేదు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అయింది.