తరుణ్‌భాస్కర్, ఈషా రెబ్బా జంటగా రూపొందిన హాస్యప్రధాన కుటుంబకథాచిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి’. ఏ.ఆర్.సంజీవ్ దర్శకుడు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు, కిశోర్ జాలాది, బాల సౌమిత్రి నిర్మాతలు. జనవరి 23న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా సంగీత ప్రయాణాన్ని నిర్మాతలు మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా ఇందులోని తొలిపాటను మంగళవారం విడుదల చేశారు. ‘సిన్నదానా ఏందమ్మా ఈ హైరానా’ అంటూ సాగే ఈ పాటను భరద్వాజ్ గాలి రాయగా, జయకృష్ణ స్వరపరిచారు. అప్పగింతల నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాటలో తరుణ్‌భాస్కర్, ఈషారెబ్బాల అభినయం చాలా సహజసిద్ధంగా సాగింది. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ, బిందు చంద్రమౌళి, ధీరజ్ ఆత్రేయ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: నందకిశోర్ ఈమని, కెమెరా: దీపక్ యెరగరా, సంగీతం: జై క్రిష్.