OG Movie Ticket Hikes | పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపుపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాకు సంబంధించిన టికెట్ రేట్ల పెంపు జీవోను జరిగిందని.. పక్క రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్) ఈ సినిమాకు జీవో ఇచ్చారు కాబట్టి, ఇక్కడ కూడా ఇచ్చారు అనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇకపై రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు పెంచడం జరగదని చిన్న సినిమాలు అయినా, పెద్ద సినిమాలు అయినా ఒక్కటే టికెట్ రేటు అమలు చేస్తాం అని మంత్రి ప్రకటించారు. అనంతరం సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వాగతించారు.
‘ఓజీ’ సినిమా టికెట్ ధరల పెంపును అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు బుధవారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఓజీ ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 800 పెంపుతో పాటు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు రెగ్యులర్ షోలకు సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 150 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. టికెట్ ధరలను సాధారణ రేట్లకే విక్రయించాలని న్యాయస్థానం ఆదేశించింది.