Avatar 3 Telugu Trailer | హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘అవతార్’ సిరీస్ నుండి మూడవ భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar: Fire and Ash)’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ తెలుగు భాషలో కూడా విడుదల కావడం తెలుగు సినీ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’లో సముద్ర తెగను చూపించిన జేమ్స్ కామెరూన్, ఈసారి ‘యాష్ పీపుల్’ (Ash People) అనే భయంకరమైన అగ్ని గిరిజన తెగను పరిచయం చేశారు. వీరు అగ్నిని ఆరాధిస్తూ.. యుద్ధానికి దుర్మార్గమైన రీతిలో సిద్ధపడే తెగగా ట్రైలర్లో చూపించారు. పండోరా భవిష్యత్తుకు వీరు ప్రధాన ముప్పుగా నిలవనున్నారు.
ట్రైలర్లో జేక్ సుల్లీ (Jake Sully), నేటిరీ (Neytiri) తమ కొడుకు నెటియమ్ని కోల్పోయిన తర్వాత వారి కుటుంబం ఎదుర్కొంటున్న వేదన, కోపం, ప్రతీకారం అనే అంశాలు భావోద్వేగపూరితంగా చూపబడ్డాయి. కుటుంబ బంధాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, నమ్మకాలు, త్యాగాలు మూవీ సగం స్టోరీని ముందుకు నడిపిస్తాయని ట్రైలర్ సంకేతాలు ఇస్తోంది. అగ్ని పర్వతాలు, లావా ప్రవాహాలు, కొత్త జీవ జాతులు, మరియు అత్యంత శక్తివంతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ ట్రైలర్ అబ్బురపరిచింది. ప్రపంచ సినీ ప్రేక్షకులకు మళ్లీ ఓ విజువల్ వండర్‌ను చూపించడానికి జేమ్స్ కామెరూన్ సిద్ధమవుతున్నాడని స్పష్టమవుతోంది.
ఈ సినిమా 2025 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. భారతీయ సినీ అభిమానుల్లో ఇప్పటికే ఈ ట్రైలర్ పట్ల మంచి స్పందన కనిపిస్తోంది. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్ విడుదలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌కి చేరాయి. భావోద్వేగాలు, యాక్షన్, విజువల్స్ అన్నింటినీ సమపాళ్లలో కలిపి ఈ చిత్రం పండోరా ప్రపంచాన్ని మరోసారి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.