దుబాయ్: ఆసియాకప్‌లో ఆదివారం సెప్టెంబర్ 28వ తేదీన ఇండోపాక్(India Vs Pakistan) జట్లు ఫైనల్లో పోటీపడనున్నాయి. ఆసియాకప్ టోర్నమెంట్‌కు 41 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్నది. అయితే ఇప్పటి వరకు మల్టీనేషనల్ టోర్నీల్లో అయిదుసార్లు ఇండో, పాక్ జట్లు ఫైనల్లో తలపడ్డాయి. అయిదింటిలో పాకిస్థాన్ మూడు సార్లు ఫైనల్స్ గెలిచింది. తొలిసారి ఇండోపాక్ జట్లు వరల్డ్ చాంపియన్‌షిప్ క్రికెట్ ఫైనల్లో తలపడ్డాయి. ఆ టోర్నమెంట్ 1985లో జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. చివరిసారి రెండు జట్లు 2017లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడాయి. ఆ మ్యాచ్‌లో 180 రన్స్ తేడాతో పాకిస్థాన్ గెలుపొందింది.
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్, 1984
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 9 వికెట్లు కోల్పోయి 176 రన్స్ చేసింది. జావెద్ మియందాద్ 92 బంతుల్లో 48 రన్స్ చేశాడు. భారత బౌలర్ కపిల్ దేవ్ 23 పరుగులిచ్చి మూడు వికెట్లు, శివరామకృష్ణన్ 35 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నారు. ఆ తర్వాత రవిశాస్త్రి 63, శ్రీకాంత్ 67 రన్స్ స్కోరు చేసి 8 వికెట్ల తేడాతో ఇండియాకు విజయాన్ని అందించారు.
ఆస్ట్రల్-ఆసియా కప్ ఫైనల్ 1986
ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 245 రన్స్ చేసింది. సునీల్ గవాస్కర్ 134 బంతుల్లో 92 రన్స్ చేశాడు. అయితే పాకిస్థాన్ ఆ టార్గెట్‌ను ఛేజ్ చేసింది. చివరి బంతికి జావెద్ మియందాద్ సిక్సర్ కొట్టి భారత్‌ను నిరాశ పరిచాడు. చేతన్ శర్మ బౌలింగ్‌లో అతను సిక్సర్ బాదాడు. మియందాద్ 114 బంతుల్లో 116 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఆస్ట్రల్-ఆసియా కప్ ఫైనల్ 1994
పాకిస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 6 వికెట్లకు 250 రన్స్ స్కోర్ చేసింది. సయిద్ అన్వర్ 47, ఆమిర్ సోహెల్ 69, బాసిత్ అలీ 57 రన్స్ స్కోర్ చేశారు. చేజింగ్ ఇండియా తడబడింది. 211 పరుగులకే ఆలౌటైంది. వినోద్ కాంబ్లీ ఒంటిరి పోరాటం చేశాడు. అతను 56 రన్స్ స్కోర్ చేశాడు.
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్
ఫైనల్లో గౌతం గంభీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతుల్లో 75 రన్స్ చేశాడు. రోహిత్ శర్మ కూడా 16 బంతుల్లో 30 రన్స్ చేశాడు. దీంతో ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 రన్స్ చేసింది. దీనికి బదులుగా పాకిస్థాన్ ధీటుగా ఆడినా 152 రన్స్‌కే ఆలౌటైంది. మిస్బా ఉల్ హక్ ఒంటరి పోరాటం చేసినా ఓటమి తప్పలేదు.
చాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్
టోర్నీలో ఫెవరేట్‌గా పోటీలో దిగిన భారత్ అనూహ్యతి రీతిలో ఫైనల్లో ఓడింది. పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతను 114 రన్స్ స్కోర్ చేశాడు పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 338 రన్స్ చేసింది. ఇక చేజింగ్ ఇండియా బ్యాటింగ్ లైనప్ తడబడింది. రోహిత్, విరాట్, ధావన్ వికెట్లను ఆమిర్ తీశాడు. ఇండియా 158 రన్స్ కే ఆలౌటై.. 180 రన్స్ తేడాతో ఓడిపోయింది.