OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘OG’ (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా తన స్టైలిష్ మేకింగ్, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా విడుదలైన తొలి రోజునుంచే అభిమానుల్లో భారీ హైప్ సృష్టించిన ‘OG’.. థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను సుజీత్ చూపించిన విధానం అభిమానులను ఉర్రూతలూగించింది. పవన్ మ్యానరిజమ్స్, స్టైలిష్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
అలాగే సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో పెద్ద హైలైట్‌గా నిలిచింది. యాక్షన్ సన్నివేశాల్లో థమన్ ఇచ్చిన ఎలివేషన్స్ థియేటర్లలో అభిమానులతో విజిల్స్ వేయించాయి. పాటలు కూడా మంచి స్పందన అందుకున్నాయి.ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే శాటిలైట్ హక్కుల విషయంపై మాత్రం ఇంతకాలం స్పష్టత రాలేదు. తాజాగా ఆ సస్పెన్స్‌కు తెరపడినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫిలింనగర్ సమాచారం ప్రకారం.. ‘OG’ శాటిలైట్ హక్కులను ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈటీవీ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయడానికి ఛానల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ వార్తతో పవన్ అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. థియేటర్లలో, ఓటీటీలో ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. టెలివిజన్‌లో కూడా భారీ టీఆర్పీ రేటింగ్స్ నమోదు చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటనతో పాటు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ కూడా వెల్లడయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా టీవీ ప్రీమియర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో మెప్పించారు. ఆయన పాత్ర కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.