Nuvvu Naaku Nachav | తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిన చిత్రాలలో నువ్వు నాకు నచ్చావ్(Nuvvu Naaku Nachchav) ఒకటి. విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. కె. విజయభాస్కర్ దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించాడు. 2001 సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వెంకీ కెరీర్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కోటి సంగీతం అందించిన పాటలు అప్పట్లో పెద్ద హిట్ అయ్యాయి.
అయితే ఈ సినిమాలో వెంకీ చెప్పిన ఒక కట్టు కథను ఏఐ రూపంలో నిజం చేసి చూపించాడు శివ అనే ఒక నెటిజన్. ఇందులో వెంకీ తాను వైజాగ్ కలెక్టర్ అయ్యి సీఎం చంద్రబాబు నాయుడుతో కాన్ఫరెన్స్‌లో ఉండగా.. తన తండ్రి వచ్చి బయట వెయిట్ చేస్తుంటే.. తాను అది చూసి.. చంద్రబాబు.. బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడంటూ ఉండే సన్నివేశం ఉంటుంది.
అయితే, ఈ సంభాషణను అచ్చం నిజంగా జరిగినట్లుగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ఓ నెటిజన్ (శివ) వీడియో రూపంలో చూపించాడు. వెంకటేష్ చెప్పినట్లుగానే ఆయన కలెక్టర్‌గా, చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నట్లు, చంద్రమోహన్ బయట వేచి చూస్తున్నట్లుగా ఈ ఏఐ వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నువ్వు నాకు నచ్చావ్’ అభిమానులు, సినీ ప్రియులు ఈ ఏఐ క్రియేషన్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. సాంకేతికత ఎంత దూరం వచ్చిందో అని ప్రశంసిస్తున్నారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అనకాపల్లి నుండి హైదరాబాద్‌కు ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చిన వెంకటేశ్వర్లు (వెంకటేష్) తన తండ్రి స్నేహితుడైన మూర్తి (ప్రకాష్ రాజ్) ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. మూర్తి కుమార్తె నందిని (ఆర్తి అగర్వాల్)కి అమెరికా కుర్రాడితో నిశ్చితార్థం జరుగుతుంది. వెంకీ ఆ నిశ్చితార్థం సజావుగా జరిగేలా సహాయం చేస్తాడు. ప్రారంభంలో చిన్న చిన్న గొడవలతో మొదలైన వెంకీ, నందినిల పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారుతుంది.
కాలక్రమేణా, నందిని వెంకీని ప్రేమిస్తుంది, తన ప్రేమను అతనికి వ్యక్తపరుస్తుంది. అయితే, వెంకీ కూడా నందినిని ప్రేమించినా, వారి కుటుంబాల మధ్య ఉన్న మంచి సంబంధాన్ని చెడగొట్టకూడదని భావించి, తన ప్రేమను దాచుకుంటాడు. ఈ క్రమంలో జరిగే సంఘటనలు, హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. చివరికి, పరిస్థితులు మారి, నందిని, వెంకీల ప్రేమ విషయం అందరికీ తెలిసి, వారు ఎలా ఒకటి అవుతారు అనేది సినిమా కథ.