ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో అగ్ర కథానాయికలు ఏడాదికి రెండుమూడు చిత్రాలు చేయడమే కష్టమైపోతున్నది. అలాంటిది ఒకే క్యాలెండర్ ఇయర్లో ఏడు చిత్రాలు చేసిన దక్షిణాది నాయికగా అనుపమ పరమేశ్వరన్ కొత్త ఫీట్‌ను సాధించింది. గతకొన్నేళ్లలో ఇదే రికార్డని అంటున్నారు. అనుపమ పరమేశ్వరన్ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘లాక్డౌన్’ రిలీజ్ డేట్‌ను బుధవారం ప్రకటించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.
సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అగ్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మించింది. ఏఆర్ జీవా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ ఏడాదిలో అనుపమ పరమేశ్వరన్‌కు ఇది ఏడో రిలీజ్ కావడం విశేషం. ఈ ఏడాది తమిళంలో డ్రాగన్, బైసన్, ది పెట్ డిటెక్టివ్ చిత్రాల్లో నటించింది అనుపమ. అందులో డ్రాగన్, బైసన్ మంచి విజయాల్ని అందుకున్నాయి. తెలుగులో కిష్కింధపురి, పరదా చిత్రాలను చేసింది. మలయాళంలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో శర్వానంద్ సరసన ‘భోగి’ చిత్రంలో నటిస్తున్నది.