ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం గత ఏడాది సెప్టెంబర్ 27న విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దేవర, వర పాత్రల్లో ఎన్టీఆర్ శక్తివంతమైన నటన అందరిని మెప్పించింది. సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా..దీనికి సీక్వెల్‌గా ‘దేవర-2’ను తెరకెక్కించబోతున్నట్లు శనివారం నిర్మాణ సంస్థ సోషల్‌మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘దేవర’ తుఫాను సముద్రతీరాల్ని తాకి విధ్వంసాన్ని సృష్టించి నేటితో ఏడాది పూర్తయింది.
‘దేవర’ పేరు అందరికీ గుర్తుండిపోయింది. ప్రేమతో కావొచ్చు లేదా భయంతోనైనా కావొచ్చు..దేవర పేరుని మాత్రం ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు మనమంతా ‘దేవర-2’కోసం సిద్ధమవుదాం’ అంటూ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయ్యాక ఆయన ‘దేవర-2’ ప్రాజెక్ట్‌లో జాయిన్ కానున్నారు. తొలిభాగం కంటే తీవ్రమైన భావోద్వేగాలు, యాక్షన్ ఘట్టాలతో సీక్వెల్‌ను రూపొందించబోతున్నామని దర్శకుడు కొరటాల శివ గతంలోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు ‘దేవర-2’ మీద భారీ అంచనాల్ని పెట్టుకున్నారు.