NTR | దివంగత నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ 69వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యాడు. తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియా ద్వారా ఓ భావోద్వేగపూరిత సందేశాన్ని షేర్ చేశారు. తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని అక్షరాల్లో పంచుకుంటూ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘‘ఈ అస్తిత్వం మీరు… ఈ వ్యక్తిత్వం మీరు’’ . మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే అంటూ రాసుకొచ్చారు. ఈ పదాలు హరికృష్ణ పట్ల తారక్‌కు ఉన్న గాఢమైన ప్రేమను, గౌరవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అభిమానులు, నెటిజన్లు కూడా ఈ పోస్టుపై స్పందిస్తూ హరికృష్ణను స్మరించుకుంటున్నారు.
2018, ఆగస్టు 30న హరికృష్ణ నల్లగొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు హరికృష్ణ. నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహానికి వెళ్తుండగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆయన అకాల మృతిని అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. హరికృష్ణ ఆత్మకి శాంతి చేకూరాలని పలువురు అభిమానులు కూడా ప్రార్ధిస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఇటీవల వార్ 2 చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఇందులో హృతిక్ రోషన్ కూడా నటించాడు. భారీ మల్టీ స్టారర్‌గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఎన్టీఆర్ డెబ్యూ బాలీవుడ్ మూవీ నిరాశపరిచింది.
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందన్న వార్తలే వినిపిస్తున్నాయి. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటించనుండగా, షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. చివరిగా ఎన్టీఆర్ దేవరతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇందులో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది.