ఈ నెల 14న ‘వార్ 2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు తారక్. బాలీవుడ్లో ఆయన చేసిన తొలి సినిమా ఇదే కాగా, తెలుగులోనూ ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) షూటింగ్లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమాను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలనే గట్టి తలంపుతో ఉన్నారాయన. ఈ సినిమా తర్వాత ఆలస్యం చేయకుండా ‘దేవర 2’ సెట్లోకి ఎంట్రీ ఇస్తారట తారక్. ప్రస్తుతం ‘దేవర 2’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నది.
అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు దర్శకుడు కొరటాల శివ. ‘దేవర’కు సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో తొలి భాగంలో తలెత్తిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకనున్నాయి. జాన్వీ కపూర్ పాత్ర కూడా ‘దేవర 2’లో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తున్నది. 2027 సంక్రాంతి కానుకగా ‘దేవర 2’ను విడుదల చేయాలని నిర్మాతలు కల్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరి భావిస్తున్నారని సమాచారం.