NTR | సోషల్ మీడియా పెరిగిన కొద్దీ ట్రోల్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా సినీ హీరోల ఫ్యాన్ వార్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. “మా హీరో గొప్ప – మీ హీరో కాదు” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకుంటున్నారు. అది సినిమా వరకు మాత్రమే పరిమితమైతే పర్వాలేదు, కానీ ఇప్పుడు వ్యక్తిగత స్థాయికి వెళ్లి కుటుంబ సభ్యులు, భార్యలు, పిల్లలపై కూడా అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం హీరోల ఫోటోలను అమ్మాయిల బాడీలకు మార్ఫ్ చేసి పోస్టులు పెడుతూ దారుణంగా వ్యవహరిస్తున్నారు.
ఇలాంటి హద్దు దాటిన ట్రోలింగ్‌కు ఈసారి బలయ్యింది మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌పై వివిధ మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మొదట్లో అభిమానులు వీటిని లైట్‌గా తీసుకున్నా, ఇప్పుడు మాత్రం పరిస్థితి తీవ్రంగా మారింది. ఈసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు చాలా దారుణంగా ఉండడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు నందిపాటి మురళీ, ఈ మార్ఫింగ్ వీడియోలపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ని కలిసి ఎన్టీఆర్ పరువు తీయడానికి కొందరు కావాలనే ఈ వీడియోలు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఫిర్యాదులో, “ఎన్టీఆర్ ఇమేజ్‌కి భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు కంటెంట్ తయారు చేసి, షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలను వెంటనే తీసివేయాలి. వాటి వెనుక ఉన్న వారిని గుర్తించి చట్టపరంగా శిక్షించాలి” అని పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన సీపీ సజ్జనార్, “ఇలాంటి చర్యలు అస్సలు సహించబోము. దోషులపై సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు “ఇది కేవలం ఒక నటుడిపై కాదు, ఒక మనిషిపై దాడి” అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న “డ్రాగన్” చిత్రంలో నటిస్తున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చుట్టూ ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు నీల్ – ఎన్టీఆర్ మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే షూటింగ్ ఆగిపోయిందని చెబుతున్నా, దీనిపై అధికారిక సమాచారం ఏదీ వెలువడలేదు.