NTR | ‘దేవర’ విజయంతో మంచి జోష్‌మీద ఉన్నారు తారక్. ఈ ఊపులోనే బాలీవుడ్ ‘వార్ 2’ను కూడా చకచకా కానిచ్చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న స్పైగా కనిపించనున్నట్టు బీటౌన్ సమాచారం. ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్‌నీల్ సినిమాను పట్టాలెక్కించనున్నారు తారక్. రీసెంట్గా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో గప్‌చుప్‌గా ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరిగాయి. లిమిటెడ్ పీపుల్ మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా అప్డేట్ ప్రకారం నవంబర్ చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది. అందుకు తగ్గ ఏర్పాట్లలో ప్రశాంత్‌నీల్ బిజీగా ఉన్నారట. కానీ తారక్ మాత్రం సంక్రాంతి తర్వాత ఈ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ‘వార్ 2’ని ముగించి, ప్రశాంత్‌నీల్ సినిమాకు సంబంధించిన లుక్‌లోకి మారడానికి ఈ మధ్య సమయాన్ని కేటాయించనున్నారు ఎన్టీఆర్. 2026 జనవరి 9న, సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రశాంత్‌నీల్ ఇప్పటికే ప్రకటించారు.