Nora Fatehi |బాహుబలి సినిమాలోని ‘మనోహరి’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి–నర్తకి నోరా ఫతేహి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మద్యం మత్తులో ఉన్న ఓ డ్రైవర్ తన కారు తో నోరా ఫతేహి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో నోరా ఫతేహి తీవ్ర ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాల ప్రకారం.. నోరా ఫతేహి అంతర్జాతీయ డీజే డేవిడ్ గుట్టాతో కలిసి సన్‌బర్న్ ఫెస్టివల్ కోసం ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆమె ప్రదర్శన ఇవ్వాల్సిన వేదికకు వెళ్తున్న సమయంలోనే ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఘటన జరిగిన వెంటనే నోరా బృందం అప్రమత్తమై ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించింది.
వైద్యులు నోరాకు సీటీ స్కాన్ నిర్వహించి అంతర్గత గాయాలు లేదా రక్తస్రావం ఏమైనా ఉందా అనే విషయాన్ని పరిశీలించారు. స్కాన్ రిపోర్ట్ ప్రకారం నోరా ఫతేహికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని తేలింది. పెద్ద ప్రమాదం తప్పడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వైద్యులు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, తన వృత్తిపరమైన నిబద్ధతను గౌరవిస్తూ నోరా తిరిగి పనిలో పాల్గొనాలని పట్టుబట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన అదే సాయంత్రం సన్‌బర్న్–2025 ఈవెంట్లో తన షెడ్యూల్ ప్రకారం కనిపించాలని ఆమె నిర్ణయించుకోవడం నిర్వాహకులతో పాటు అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయంతో నోరా ప్రొఫెషనలిజంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గత దశాబ్ద కాలంగా భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నోరా ఫతేహి, ముఖ్యంగా దక్షిణాదిలో చేసిన ఐటమ్ నంబర్లతో యువతలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ‘బాహుబలి’లోని ‘మనోహరి’ పాట ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచి, యువ హృదయాలను దోచుకుంది. తాజాగా జరిగిన ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడటంతో అభిమానులు హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటున్నారు.