విఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రేక్షకులకు వరుసపెట్టి స్వీట్ షాక్‌లు ఇచ్చేస్తున్నారు. మహేశ్‌బాబుతో తాను చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘SSMB 29’ విషయంలో ఎలాంటి అప్డేట్లూ ఇవ్వడం లేదంటూ ఇన్నాళ్లూ అసహనం వ్యక్తం చేసిన అభిమానులపై అప్డేట్ల వర్షం కురిపించేస్తున్నారాయన. ఈ నవంబర్‌లో సర్ప్రైజులుంటాయని రాజమౌళి ముందే చెప్పారు. చెప్పినట్టే నవంబర్ ప్రారంభమైందో లేదో.. ‘గ్లోబ్ ట్రాటర్’ వేడుకను ఈ నెల 15న హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో అట్టహాసంగా చేస్తున్నట్టు ప్రకటించేశారు.
అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్లన్నీ ఆ వేడుకలోనే ఇచ్చేస్తామంటూ అందర్నీ ఊరించేశారు కూడా. ఈ నేపథ్యంలో సోమవారం అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. అసలు ఏమాత్రం అనౌన్స్మెంట్ లేకుండా ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు రాజమౌళి. ‘కాలాన్నీ శాసిస్తూ ప్రతిరోజూ పరుగేలే.. వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే.. ఖండాలే దాటేస్తూ.. ఖగరాజై వాలే.. రారా.. రారా.. ధీరా.. ధృవతారా.. రారా.. స్వైరా.. సంచారా..’ అంటూ ఓ సాహస యాత్రికుడిని కీర్తిస్తూ ఈ పాట సాగింది. చైతన్యప్రసాద్ రాసిన ఈ పాటను శృతిహాసన్ తనదైన గంభీరమైన స్వరంతో ఆలపించారు. ఎం.ఎం.కీరవాణి స్వరకర్త. ‘సంచారి సంచారి నినదించే రణభేరి.. సంహారీ సంహారీ.. మృత్యువుపై తన స్వారీ..’ లాంటి పదాలు ఈ పాటలో గూజుబంప్స్ తెప్పిస్తున్నాయి. ఏదిఏమైనా తొలిపాటతోనే సంచలనానికి తెరతీశారు రాజమౌళి.