భారతీయ పురాణేతిహాసం రామాయణం దశాబ్దాలుగా వెండితెరపై ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. ఇప్పటికే తెలుగుతో పాటు వివిధ భారతీయ భాషల్లో రామాయణగాథ పలుమార్లు వెండితెర దృశ్యమానం అయిన విషయం తెలిసిందే. తాజాగా నితేశ్ తివారీ దర్శకత్వంలో రామాయణం మరోసారి ప్రేక్షకుల ముందుకురానుంది. ‘రామాయణ’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సీతారాముల పాత్రల్లో సాయిపల్లవి, రణబీర్‌కపూర్ నటిస్తున్నారు. రావణాసురుడిగా కన్నడ అగ్ర నటుడు యష్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే తొలిభాగానికి సంబంధించిన యాభైశాతం చిత్రీకరణ పూర్తయింది.
తాజాగా ఈ సినిమా బడ్జెట్ గురించి నిర్మాత నమిత్ మల్హోత్రా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దాదాపు 4000కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలను తెరకెక్కించబోతున్నామని, ఇది భారతీయ సినిమాలో రికార్డని, మరే చిత్రం ‘రామాయణ’ దరిదాపుల్లోకి కూడా రాదని అన్నారు. ‘ఈ సినిమా కోసం మేము సొంతంగా నిధులు సమకూర్చుకుంటున్నాం. ఈ ఇతిహాసాన్ని ప్రపంచమంతా చూడాలన్నదే మా సంకల్పం. ఈ ప్రాజెక్ట్‌తో ప్రపంచ సినిమా భారత్‌వైపు చూస్తుంది. తరాలు మారినా, యుగాలు మారినా రామాయణం ఎప్పటికీ గొప్ప ఇతిహాసమే’ అని నమిత్ మల్హోత్రా అన్నారు. ‘రామాయణ’ తొలిభాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకురానుంది.