దిల్లీలో పుట్టిన నిష పహుజ… చిన్నప్పుడే తల్లిదండ్రులతో కెనడా వెళ్లిపోయారు. అక్కడ స్థిరపడినప్పటికీ, భారతీయ మూలాలను మర్చిపోలేదు. అందరు భారతీయుల్లాగా, చిత్రాల పట్ల తన ప్రేమనూ వదులుకోలేదు. డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ, తన ప్రతిభను చాటుకుంటున్నారు. నిర్భయ ఉదంతం తర్వాత సమాజంలో ఉన్న లైంగిక వివక్ష మీద తను తీసిన ‘ద వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ అందరినీ ఆలోచింపజేసింది.
మనకు కావల్సింది బలమైన చట్టాలు కాదు, మనసున్న మనుషులు అని దీనిద్వారా నిరూపించింది. నిష మరో డాక్యుమెంటరీ తీస్తున్న సందర్భంలో జార్ఖండ్లో జరిగిన ఓ బాధాకరమైన ఉదంతం గురించి తనకు తెలిసొచ్చింది. ఓ 13 ఏళ్ల రైతుబిడ్డను, ముగ్గురు బంధువులు ఎత్తుకువెళ్లి అత్యాచారం చేసిన ఘటన అది.
ఈ విషయాన్ని మర్చిపోమని అందరూ ఆ పేద తండ్రికి సూచించడమే కాకుండా, వాళ్లలో ఒకరికి ఇచ్చి పెండ్లి చేయాలని బలవంత పెట్టారు కూడా. దానికి ఆ తండ్రి ఒప్పుకోలేదు సరికదా, వాళ్ల మీద కేసు పెట్టి… శిక్ష పడేవరకూ ఊరుకోలేదు. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న ఒత్తిళ్లకు లెక్క లేదు. ఆ తండ్రీకూతుళ్ల పోరాటపటిమను నిష ‘టు కిల్ ఏ టైగర్’ పేరుతో డాక్యుమెంటరీగా మలిచారు. అది ప్రేక్షకుల, విమర్శకుల మెప్పు పొందడమే కాకుండా ఆస్కార్ నామినేషన్ సైతం అందుకుంది. ఒక మంచి డాక్యుమెంటరీ ప్రజల్లో సానుభూతిని పెంచుతుందనీ, వివేచనకు పదును పెడుతుందనీ నిష నమ్ముతారు. ఆ దిశగానే తన ప్రయత్నమంతా!