Dhanush | తమిళ అగ్ర హీరో ధనుష్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్నారు. నటుడిగానే కాక, గాయకుడిగా, పాటల రచయితగా, నిర్మాతగా తన మార్క్‌ను చూపించిన ధనుష్.. పా పాండి, రాయన్ చిత్రాలతో దర్శకుడిగా కూడా సత్తా చాటారు. ఆయన దర్శకత్వంలో రానున్న మూడవ సినిమా ‘నిలవక్కు ఎన్ మేల్ ఎన్నాడి కోబమ్’. ఈ సినిమా ‘జాబిలమ్మ నీకు అంతకోపమా’ పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటైర్టెనర్ నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని, తమిళ, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న సినిమాను విడుదల చేయనున్నామని మేకర్స్ తెలిపారు.
ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే తమిళంలో విడుదలైన ‘గోల్డెన్ స్పారో..’ సాంగ్ అక్కడి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నది. తాజాగా ఈ పాట తెలుగు వెర్షన్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. రాంబాబు గోసాల రాసిన ఈ పాటను జి.వి ప్రకాశ్‌కుమార్ స్వరపరచగా, అశ్విన్ సత్య, సుధీష్ శశికుమార్, సుభాషిణి ఆలపించారు. ఈ పాటలో ప్రియాంక మోహన్ లుక్స్, స్టెప్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయని మేకర్స్ చెబుతున్నారు. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియాప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: లియోన్ బ్రిట్టో, నిర్మాణం: వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్కె ప్రొడక్షన్స్.