ఆ స్వరం.. పాప్‌ను పలికిస్తుంది.ఆ గొంతుక శాస్త్రీయాన్ని ఒలికిస్తుంది. ఆ పెదాలు పరమాత్మ తత్వాన్నికీర్తిస్తాయి. ఆ బేస్ వాయిసే ఇప్పుడు.. సూటిగా ప్రశ్నిస్తుంది. సుతిమెత్తగా సమాధానాలు రాబడుతుంది.కొన్నిసార్లు నిలదీసినంత పని చేస్తుంది. సోనీ లివ్ ఓటీటీలో విడుదలైన ‘నిజం విత్ స్మిత’ టాక్‌షో.. ఐడియా నుంచి ప్రసారం వరకూ ప్రతి ఘట్టం తన ఆలోచనలకు ప్రతిబింబమని చెబుతున్నారు గాయని స్మిత.
అడిగాం. వచ్చే ఎపిసోడ్స్‌లో చూస్తారు. అడిగితే తప్పేముంది? క్రష్.. ఎదిగే వయసులో కలిగే
సహజమైన భావన. ఎదిగిన వాళ్లకు అవన్నీ చాలా చిన్న విషయాలు. క్రష్, లవ్.. ప్రతి జీవితంలో ఉంటాయి. వీటిని అడగడానికి కంగారుపడను. ‘అడగాలా? వద్దా?’ అని సందేహించను. చెప్పాలనుకున్న వాళ్లు చెబుతారు. లేనివాళ్లు చెప్పరు. ఆడామగ.. తేడా చూపించని వాతావరణంలో పెరిగాను. నా
ఆలోచనల్లో లింగ వివక్ష లేదు. నా కార్యక్రమాల్లోనూ ఉండదు.
‘నిజం’ టాక్ షో వినోదానికే పరిమితం కాదు. తమ చుట్టూ ఏం జరుగుతున్నదనే అవగాహన కల్పిస్తుంది. సరదా సంభాషణతో మొదలు పెట్టినా.. ప్రతి ఎపిసోడ్ సామాజిక విషయాల చుట్టూ తిరిగేలా టాక్ షోను డిజైన్ చేశాం. అందుకే మీ ముందుకు రావడానికి ఏడాది పట్టింది. ప్రతి ఎపిసోడ్లో అనేకానేక
జ్ఞాపకాలు ప్రవహిస్తాయి. తనదైన రంగంలో ఓ వ్యక్తి ఎదిగిన తీరు, ఆ రంగాన్ని అతను ప్రభావితం చేసిన విధానం తెలుసుకుంటారు.
‘నిజం విత్ స్మిత’ టాక్ షోకు నేను ప్రయోక్తనే కాదు, ప్రొడ్యూసర్ని కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే.. నేనే ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేశాను. సోనీ వాళ్లకు నచ్చింది. కంటెంట్‌లో క్వాలిటీ, థీమ్‌లో క్రియేటివిటీ ఉండాలన్నది వాళ్ల పాలసీ. నా విధానం కూడా అదే.
పాట వేరు. సంభాషణ వేరు. రెగ్యులర్ టాక్ షోలు, ఎంటర్టైన్మెంట్ షోలు చేయడం ఒక ఎత్తు. సోషల్ కాన్సెప్ట్‌తో హోస్ట్ చేయడం మరో ఎత్తు. ‘నిజం’లో ప్రతి ఎపిసోడ్ ప్రత్యేకమైందే. ఇది..టాక్ షోకు, జర్నలిజానికి మధ్యస్థంగా ఉండే కార్యక్రమం. ఒక వ్యక్తి జీవితాను భవాలను జ్ఞాపకాల లోతుల్లోంచి చెప్పించాలి. దాంతోపాటే, ఆ సంభాషణలో సామాజిక మార్పుల్ని ఆవిష్కరించాలి. ఇందుకు ఎంతో శ్రమపడాలి. ఎంచుకున్న అంశం పట్ల అవగాహన ఉండాలి. ఆ వ్యక్తి గురించి తెలిసుండాలి. శ్రమ, ప్రతిభ, సృజనతోనే ఇదంతా సాధ్యం.
మొదటి ఎపిసోడ్ కోసం ‘కష్టేఫలి’ కాన్సెప్ట్ తీసుకున్నాం. స్వయంకృషికి చిరంజీవి మరో పేరు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. తండ్రి కానిస్టేబుల్. అనేక అడ్డంకులు తట్టుకుని నిలిచారు. మెగాస్టార్‌గా ఎదిగారు. టాక్‌షోలో ఆ ప్రయాణాన్ని మనసువిప్పి పంచుకున్నారు చిరంజీవి. తన జీవితంలోని కష్టనష్టాలనూ ప్రస్తావించారు. ‘ఎప్పుడూ షేర్ చేసుకోని విషయాలు కూడా ఈ షోలో వెల్లడించాను’ అని చిరంజీవిగారే అన్నారు. కట్, బ్రేక్ లేకుండా రెండు గంటలపాటు సంభాషించారు. మా టాక్ షో ప్రీ ప్లాన్డ్గా ఉండదు. అన్ని ఎపిసోడ్స్‌లోనూ ఇదే ధోరణి.
సమాజం పట్ల బాధ్యత ఉన్నవారితో సంభాషణ అంటే కత్తి మీద సామే. నేను యాక్టివ్ పాలిటిక్స్‌లో లేను. సమాజంలో జరిగే ప్రతి సంఘటనకూ స్పందించి మాట్లాడకపోవచ్చు. కానీ, ప్రయోక్తగా వ్యవహరిస్తున్నప్పుడు స్పందించాల్సిందే. దేశం, ప్రాంతం, సమాజం పట్ల నాకు అవగాహన ఉంది. అదే ఇప్పుడు ఉపయోగపడింది. ఫిల్మ్ స్టార్, స్పోర్ట్స్ పర్స నాలిటీల కోసం ప్రశ్నలు సిద్ధం చేయడానికి ఎంత శ్రమిస్తానో, పొలిటీషియన్ల ఎపిసోడ్స్ కోసమూ అంతే పనిచేస్తాను.
నాకు ఆ సమస్య రాలేదు. పది ఎపిసోడ్స్‌లో ఒక్కసారి కూడా ఎదురుకాలేదు. అందరూ బోళాగానే మాట్లాడారు.
నేను ఫలానా మాత్రమే అని చెప్పుకోవడానికి మనసొప్పదు. నా ఆలోచనలు నాకున్నాయి. సింగర్‌ని కావడం వల్ల ఎక్కువ మందికి పరిచయం అయ్యాను. పాప్ సింగర్‌గానే కాకుండా ప్లేబ్యాక్ సింగర్‌గా రాణించాను. ఆధ్యాత్మిక పాటలు పాడాను. మా తాతగారు ఆటోమొబైల్ బిజినెస్ చేశారు. అది మాకు వారసత్వంగా వచ్చింది. దానితోపాటు ‘బబుల్స్’ పేరుతో స్పా, సెలూన్ వ్యాపారంలో అడుగుపెట్టాను. వీటికి చాలా ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఆంత్రప్రెన్యూర్షిప్కే జీవితంలో ఎక్కువ సమయం ఖర్చయిపోయింది. ఆరేండ్ల నుంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌పై రీసెర్చ్ చేస్తున్నాను. రెండు మూడు నెల్లలో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తాను.
గాయనిగానే ఎంతోమంది అభిమానం పొందాను. ప్లే బ్యాక్ సింగర్స్ చాలామంది ఉన్నారు. కానీ, ఇండిపెండెంట్ మ్యుజీషియన్గానే నాకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయాను. ఇది నా అదృష్టం.
నాగవర్ధన్ రాయల