Raakaasa Movie | జీ స్టూడియోస్ సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల మరియు ఉమేష్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రాకాస’. యువ దర్శకురాలు మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ అత్యంత వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరై సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. జీ స్టూడియోతో కలిసి పనిచేయడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో తాము చేసిన ‘మ్యాడ్ హౌస్’ అనే యూట్యూబ్ సిరీస్ సమయంలోనే దర్శకురాలు మానస శర్మ డైలాగ్స్ విన్నానని, ఆమె ప్రతిభ అప్పుడే నచ్చిందని గుర్తుచేసుకున్నారు. మానస ఎప్పుడూ సినిమా గురించి, కథ గురించే ఆలోచిస్తూ ఉంటుందని, ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ప్రశంసించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడం తనకు గర్వంగా ఉందని, ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఎందుకు కొత్తవాళ్లతో సినిమా చేస్తున్నారంటూ చాలామంది ప్రశ్నించారని గుర్తుచేశారు. ఇలాంటి విమర్శలు పట్టించుకోకుండా తనకు నచ్చిన సినిమాలే చేస్తూ ప్రతి సినిమాతో కొత్త విషయాలను నేర్చుకుంటానని నిహారిక స్పష్టం చేశారు. తన ఫ్యామిలీతో పాటు పింక్ ఎలిఫెంట్ సంస్థ కూడా తనకు అంతే సమానమని, తనపై నమ్మకంతో పూర్తి స్వేచ్ఛనిచ్చిన తన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరినీ ఆమె పేరుపేరునా ప్రశంసించారు. ముఖ్యంగా సంగీత్ శోభన్ ఈ సినిమా విజయానికి ప్రధాన కారణమవుతాడని నమ్మకం వ్యక్తం చేసిన నిహారిక.. తామంతా ఎంతో నిజాయితీతో కష్టపడి ఈ సినిమా చేశామని, తమ పింక్ ఎలిఫెంట్ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు, కారు కొనుక్కోవాలనేదే తన అసలు లక్ష్యమని తెలిపారు. ఏప్రిల్ 3న విడుదలవుతున్న ‘రాకాస’ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచుతుందని నిహారిక ధీమా వ్యక్తం చేశారు.
హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. గత ఏడాది ఏప్రిల్‌లోనే తాము ముగ్గురం (నిహారిక, మానస, సంగీత్) కలిసి ఒక ఫోటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశామని, సరిగ్గా ఏడాది తర్వాత అదే ఏప్రిల్ 3న సినిమా విడుదల కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో పనిచేసిన కెమెరామెన్ రాజు విజువల్స్, అనుదీప్ అందించిన సంగీతం గురించి ప్రేక్షకులు థియేటర్లలో ప్రత్యేకంగా మాట్లాడుకుంటారని చెప్పారు. తనకు ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే ప్రాజెక్ట్ రావడానికి కారణమైన రచయిత మహేష్ గారి గురించి మాట్లాడుతూ, దర్శకుడిగా ఆయన రాబోయే సినిమా ‘ఇట్లు అర్జున’తో పెద్ద బ్లాక్ బస్టర్ కొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం చలికాలంలో రాత్రిపూట చాలా కష్టపడి షూటింగ్ చేశామని, నటి నయన్ సారికతో కలిసి పనిచేయడం ఎంతో మంచి అనుభూతిని ఇచ్చిందని అన్నారు. దర్శకురాలు మానసకు సినిమా పట్ల ఉన్న అంకితభావం గొప్పదని, ప్రేక్షకులు పెట్టే ప్రతి పైసాకు పూర్తి న్యాయం జరగాలని ఆమె ఎప్పుడూ తపన పడుతుంటుందని కొనియాడారు. సినిమా చూసి ఇంటికి వెళ్లేటప్పుడు కూడా ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. తమ సినిమాతో పాటే ఏప్రిల్ 3న శర్వానంద్ నటిస్తున్న ‘బైకర్’ సినిమా కూడా వస్తోందని, ప్రేక్షకులు ఈ రెండు సినిమాలను ఆదరించి విజయవంతం చేయాలని సంగీత్ కోరారు.
నాయిక నయన్ సారిక మాట్లాడుతూ.. పింక్ ఎలిఫెంట్ సంస్థలో తనకు ఇది మూడో ప్రాజెక్ట్ అని, నిహారిక గారితో పనిచేస్తే తనకు అదృష్టం కలిసి వస్తుందని తన నమ్మకాన్ని బయటపెట్టింది సారిక. దర్శకురాలు మానస శర్మకు సినిమాపై చాలా స్పష్టత ఉందని, సెట్లో గెటప్ శ్రీను అందరినీ నవ్విస్తూ సందడిగా ఉంచేవారని తెలిపారు. హీరో సంగీత్‌తో తనకు మంచి సింక్ కుదిరిందని, ఈ సినిమాను ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకురాలు మానస శర్మ మాట్లాడుతూ.. ‘బెంచ్ లైఫ్’ తర్వాత తనకు ఈ పెద్ద అవకాశాన్ని ఇచ్చిన నిహారిక తన లక్కీ చార్మ్ అని అభివర్ణించారు. రైటింగ్‌లో భాగస్వామి అయిన మహేష్‌తో పాటు తన బలం అయిన సంగీత్ శోభన్, కెమెరామెన్ రాజు, సంగీత దర్శకుడు అనుదీప్ మరియు ఎడిటర్ అన్వర్ల సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని తెలిపారు. తన ప్రయాణంలో తోడుగా నిలిచిన సీనియర్ నటులు బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి మరియు గెటప్ శ్రీనులకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ సినిమాను అందరూ తప్పకుండా చూడాలని కోరారు.
చిత్ర సహ రచయిత యదు వంశీ మాట్లాడుతూ.. నిహారిక ఎంత ధైర్యవంతురాల్లో ఉదాహరణలతో వివరించారు. ‘కమిటీ కుర్రోళ్లు’ కోసం తనపై నమ్మి 9 కోట్లు పెట్టిన ధైర్యం ఆమెదని, ఈ సినిమా బడ్జెట్ విని తాను ఆశ్చర్యపోయానని అన్నారు. కొత్త వారికి, టాలెంట్ ఉన్న వారికి నిహారిక కేరాఫ్ అడ్రస్ అని కొనియాడారు. ఇక ప్రముఖ నటుడు గెటప్ శ్రీను మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతి పైసాకు వర్త్ అని, సంగీత్ శోభన్ ప్రతి జానర్లోనూ అద్భుతంగా నటించగల గొప్ప నటుడని ప్రశంసించారు. కుటుంబమంతా కలిసి చూసి ఆనందించేలా ఈ చిత్రం ఉంటుందని హామీ ఇచ్చారు.
సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ మాట్లాడుతూ.. సినిమాలో కామెడీ కోసం తానేమీ ప్రత్యేకంగా సంగీతం చేయలేదని, సినిమాలో కామెడీ చాలా సహజంగా వర్కౌట్ అయిందని పేర్కొన్నారు. జీ స్టూడియోస్ ప్రతినిధి దివ్య విజయ్ మాట్లాడుతూ తాను ఈ సంస్థలోకి వచ్చిన తర్వాత ఎంపిక చేసుకున్న తొలి ప్రాజెక్ట్ ఇదేనని, నిహారిక ఈ సినిమాను భుజాన వేసుకుని నడిపించిందని ప్రశంసించారు. మైత్రి మూవీ మేకర్స్ తరపున శశి మాట్లాడుతూ తాము నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామని, మంచి ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉందని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి కూడా ఈ చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సాంకేతిక నిపుణులైన డీఓపీ రాజు ఎదురోలు ఈ సినిమా స్క్రిప్ట్ రాసిన దర్శకురాలిని అభినందించగా, ఆర్ట్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ సినిమాలో వేసిన భారీ కోట సెట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని చెప్పారు. వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ మురళీ మనోహర్ సుమారు మూడున్నర నెలల పాటు గ్రాఫిక్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. ఫైట్ మాస్టర్ విజయ్ టీం క్రమశిక్షణను మెచ్చుకోగా, కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి సినిమాలో వచ్చే జాతర పాట అత్యంత గ్రాండ్‌గా ఉంటుందని, ఇందుకోసం నిహారిక ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదని చెప్పారు. చివరగా లిరిక్ రైటర్ రఘు రాం ఈ సినిమాలో తాను రాసిన ‘రపప్పా’, ‘స్నేక్ డ్యాన్స్’ పాటల గురించి ప్రస్తావిస్తూ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. మొత్తానికి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చిత్ర బృందం నమ్మకాన్ని, ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.