Upcoming Movies | జనవరిలో సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేశాయి. కాస్త అటు ఇటుగా ఒక నెలలోనే దాదాపు 600 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి. ఫిబ్రవరిలో కూడా సార్, వినరో భాగ్యము విష్ణు కథ, రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలు అంచనాలు అందుకున్నాయి. కానీ ఎందుకో మరి మొదటి మూడు వారాల మీద చూపించిన శ్రద్ధ చివరి వారం మీద చూపించలేదు నిర్మాతలు.
ఎప్పటినుంచో థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న చిన్న సినిమాలు అన్ని ఒకే వారం థియేటర్స్ మీద దండయాత్ర చేస్తున్నాయి.ఇందులో కనీసం సగం సినిమాల్లో హీరో ఎవరో తెలియదు. వాళ్లను కనీసం ఎప్పుడూ చూడలేదు కూడా. జస్ట్ క్లియరెన్స్ మాల్ కింద ఈ సినిమాలన్నీ వచ్చేస్తున్నాయి. కాకపోతే ఈ వారం రాబోయే సినిమాల్లో ఒక్కదానిపై మాత్రం అందరిలోనూ ఒక ఆసక్తి క్రియేట్ అయింది.
ఆ సినిమా పేరు బలగం. కమెడియన్ వేణు దర్శకుడుగా మారి చేస్తున్న ఈ సినిమాపై నిన్న మొన్నటి వరకు అంచనాలు పెద్దగా లేవు.. కానీ తాజాగా చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే ఆసక్తి పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం.. ట్రైలర్ కూడా బాగుండడం.. అన్నింటికి మించి దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి సినిమా వస్తుండడంతో బలగంపై ఒకింత ఆసక్తిగానే ఉన్నారు ప్రేక్షకులు.
Read More: Mega Family | ఈ నెలలో మెగా సందడి.. ఎన్ని సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయో తెలుసా ?
మరోవైపు సిరిసిల్లలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరు కావడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో ఇక్కడ బంధాలు అనుబంధాలను హైలైట్ చేస్తూ వేణు తెరకెక్కించిన ఈ సినిమా కచ్చితంగా ఈ వారం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తుందని నమ్ముతున్నాడు నిర్మాత దిల్ రాజు.
ఇక ఇదే వారం విడుదలవుతున్న మరో సినిమా గ్యాంగ్ లీడర్. ఇప్పటికే మూడు నాలుగు సార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు మార్చి 4న థియేటర్లలో మళ్ళీ విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు మేకర్స్. విజయ బాపినీడు తెరకెక్కించిన ఈ సినిమా 1991లో విడుదలై సంచలన విజయం సాధించింది. చిరంజీవి సినీ ఇండస్ట్రీలో 45 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా గ్యాంగ్ లీడర్ సినిమాను మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. 4K ప్రింట్ రెడీ చేసి భారీ స్థాయిలోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మొత్తానికి ఈ వారం ఇటు వేణు.. అటు చిరంజీవి ఇద్దరూ రేస్ లో ఉన్నారు.
Read More: Balagam movie | సినిమాల్లో తెలంగాణ యాస వింటే గుండెలు ఉప్పొంగుతున్నాయి.. మంత్రి కేటీఆర్