Tollywood | ఉగాది పచ్చడిలోని తీపి, చేదు, కారం, పులుపు, ఉప్పు, వగరు లాంటి షడ్రుచుల్లాగే సినిమాలకూ ఎన్నో రుచులు. లవ్, యాక్షన్, కామెడీ, ఎమోషన్, థ్రిల్లర్, హిస్టారికల్ అంటూ భిన్న అనుభూతులను ప్రేక్షకులకు అందిస్తుంది చలనచిత్రం. సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు పండగ సందడిలో భాగమవుతుంటాయి కొత్త సినిమాలు. మంచి విషయం, శుభ సమయాన చెప్పాలన్నట్లు పర్వదినాన ఫస్ట్ లుక్, పాట, రిలీజ్ డేట్..వంటి తమ సినిమాలోని కొత్త సంగతులు వెల్లడిస్తుంటాయి. ఇలా శుభాలను కోరే శోభకృత్ నామ తెలుగు సంవత్సరాది సందర్భంగా వచ్చిన టాలీవుడ్ అప్డేట్స్ చూద్దాం..
ఆగస్టు 11న ‘భోళా శంకర్’
స్టార్ హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్నది. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో నిర్మిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తమన్నా, కీర్తి సురేష్ ఆసీనులై ఉండగా..చిరంజీవి వారి వెనకగా నిల్చున్న స్టిల్ ఆకట్టుకునేలా ఉంది. ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించారు.
సవ్యసాచి ‘డెవిల్’
కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్‌లైన్. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తునారు. పీరియాడిక్ డ్రామా కథతో నూతన దర్శకుడు నవీన్ మేడారం రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. బుధవారం సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక చేత్తో ఆయుధం, మరో చేత్తో రివాల్వర్ పట్టుకున్న కథానాయకుడి స్టిల్ ఈ పోస్టర్లో ఉంది. నిర్మాత అభిషేక్ నామా స్పందిస్తూ తమ సంస్థలో నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రమిదని, పీరియాడిక్ డ్రామాగా ఓ సరికొత్త నేపథ్యంతో ఉంటుందని అన్నారు.
మరోసారి ‘భీష్మ’ కాంబినేషన్
హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా మరో కొత్త చిత్రాన్ని ఆరంభించారు. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. తెలుగు సంవత్సరాది సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో ఆకట్టుకుంటున్నది. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల కాంబి నేషన్‌లో గతంలో తెరకెక్కిన ‘భీష్మ’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందించనున్నారు.
రఫ్ లుక్‌లో ఆశిష్
ఆశిష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సెల్ఫీ. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై దిల్ రాజు, సుకుమార్ నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కథతో నూతన దర్శకుడు విశాల్ కాశీ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా నుంచి ఉగాది సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ స్టిల్‌లో రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు ఆశిష్.
మీ ఊహకు మించి
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 108వ సినిమా ఫస్ట్ లుక్‌ను ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో శ్రీలీల, కాజల్ నాయికలుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌పై ఈసారి మీ ఊహకు మించి అనే క్యాప్షన్ పెట్టారు.
సెట్స్ పైకి ‘సైంధవ్’
హీరో వెంకటేష్ నటిస్తున్న 75వ సినిమా ‘సైంధవ్’. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా నేటి నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమవుతున్నది. వెంకటేష్ సహా కీలక పాత్రధారులు సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ చిత్రం నుంచి వెంకటేష్ లుక్‌ను విడుదల చేస్తూ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు చిత్రబృందం. హిందీ సహా దక్షిణాది భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుందీ సినిమా.