చెన్నై: ఒక వ్యక్తి తన ప్రియురాలితో కలిసి ఒక లాడ్జిలో బస చేశాడు. ఇది తెలుసుకున్న అతడి భార్య కొందరు వ్యక్తులను అక్కడకు పంపింది. భర్తను వారితో కొట్టించడంతో పాటు ప్రియురాలిపై అత్యాచారం చేయించింది. బాధిత మహిళ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. (Wife Sends Men To Rape Lover) తమిళనాడులోని తిరుప్పూర్‌కు చెందిన ఒక మహిళ, ప్రియుడైన వివాహిత వ్యక్తితో కలిసి కేరళలోని త్రిసూర్ వెళ్లింది. అక్కడ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఒక లాడ్జిలో వారిద్దరూ బస చేశారు.
కాగా, పోలీసులుగా నటించిన ఐదుగురు వ్యక్తులు బలవంతంగా వారి రూమ్‌లోకి ప్రవేశించారు. వారిద్దరి చేతులు, కాళ్లను బట్టలతో కట్టేశారు. వారి నోటిలో గుడ్డలు కుక్కారు. బలవంతంగా కారులోకి ఎక్కించి తమిళనాడు తీసుకెళ్లారు. ప్రయాణ సమయంలో ఆ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. దీంతో అతడి కాళ్లు, చేతులు విరిగాయి. ఆ తర్వాత తిరుప్పూర్‌లోని ఒక ఆసుపత్రి సమీపంలో అతడ్ని వదిలేశారు.
మరోవైపు ఆ ముఠాలోని ఇద్దరు వ్యక్తులు ఆ మహిళను మరో కారులోకి ఎక్కించారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయగా ఆ మహిళ ప్రియుడి భార్యే ఆ వ్యక్తులను కేరళ పంపినట్లు తెలుసుకున్నారు. భర్త మొబైల్ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసిన అతడి భార్య ఆ సమాచారాన్ని ముఠాకు చేరవేసినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. దీంతో ఆ వ్యక్తి భార్యతో సహా నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.