Neeraj Pandey | ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే తన తాజా చిత్రం ‘పండిట్’ (Pandat) టైటిల్‌పై చెలరేగిన వివాదంపై తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
‘ఏ వెడ్నెస్ డే’, ‘M.S. ధోని’ వంటి విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు నీరజ్ పాండే తన తదుపరి చిత్రం ‘పండిట్’ టైటిల్ విషయంలో ఎదురవుతున్న విమర్శలపై తాజాగా వివరణ ఇచ్చారు. ఈసినిమా టైటిల్ పండిట్ అనే పదం ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అయితే ఈ విషయంపై దర్శకుడు స్పందిస్తూ.. ఈ సినిమా ఒక కల్పిత కథాంశంతో సాగే కాప్ డ్రామా అని, ఇందులో ‘పండిట్’ అనే పదాన్ని కేవలం ఒక పాత్రకు పెట్టిన ముద్దుపేరుగా మాత్రమే వాడటమే తప్ప, ఏ కులాన్ని లేదా సమాజాన్ని ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు.
చిత్రనిర్మాతగా ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని ప్రేక్షకులను అలరించడం మాత్రమే తన లక్ష్యమని నీరజ్ పేర్కొన్నారు. అయితే ఈ టైటిల్ పట్ల కొంతమంది నెటిజన్లు, ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను తాము గౌరవిస్తున్నామని, ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని వెల్లడించారు. సినిమా పూర్తి కథాంశం తెలియకుండా కేవలం గ్లింప్స్ లేదా టీజర్లను చూసి నిర్ణయానికి రావడం సరికాదని భావించి, ప్రస్తుతానికి అన్ని ప్రచార చిత్రాలను సోషల్ మీడియా మరియు ఇతర వేదికల నుండి తొలగిస్తున్నట్లు నీరజ్ పాండే ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఆయన తెలిపాడు.
— Neeraj Pandey (@neerajpofficial) February 6, 2026