టైప్కాస్ట్ నటీనటులకే పరిశ్రమలో ఎక్కువ గుర్తింపు ఉంటుందని అంటున్నది బాలీవుడ్ ఓల్డ్ అండ్ బోల్డ్ బ్యూటీ నీనా గుప్తా. ఎందుకంటే, తాను ఒకేరకమైన పాత్రలు చేయలేదు కాబట్టే.. సినిమాల్లో అవకాశాలు దక్కడంలేదని విమర్శిస్తున్నది. తాజాగా, ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీనా గుప్తా మాట్లాడింది. టైప్కాస్ట్, సినిమాలు, టీవీల గురించి.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నది. ఈ సందర్భంగా నీనా మాట్లాడుతూ.. “నేను టీవీలు, సినిమాల్లో ఎన్నోరకాల క్యారెక్టర్లు చేశాను. అయితే, అలా వైవిధ్యమైన పాత్రలు పోషించడం కూడా సమస్యే!” అని చెప్పుకొచ్చింది. అందుకే టైప్‌కాస్ట్‌గా ఉండటం చాలా ముఖ్యమనీ.. అప్పుడే నటీనటులకు ఒక నిర్దుష్టమైన ఇమేజ్ వచ్చి, ఆ రకమైన పాత్రలకు వాళ్లే ఎంపికవుతారని అంటున్నది.
“ఒకవేళ టైప్కాస్ట్ కాకపోతే.. ఆ నటి ఎవ్వరికీ గుర్తురాదు. ఆమెకు అవకాశాలూ రావు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. నీనా గుప్తా.. సినీ పరిశ్రమలో ఈ పేరే ఓ సంచలనం. 80వ దశకంలో.. టీవీ షోల ద్వారానే బాలీవుడ్‌కు సమానంగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నదీ తార. నటనపరంగానే కాదు.. నిజ జీవితంలోనూ అనేక వివాదాస్పద నిర్ణయాలతో అప్పుడూ, ఇప్పుడూ వార్తల్లో హాట్ టాపిక్‌గానే నిలుస్తున్నది. నాటి వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్‌తో ప్రేమాయణం నడిపింది. పెళ్లి కాకుండానే తల్లి కావాలని నిర్ణయించుకున్నది.
ఈ ప్రేమ జంట కూతురే.. నేటి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. అలా.. సమాజంతోపాటు కుటుంబం నుంచీ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నది. అయితే, ఎన్ని అవమానాలు, కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడింది నీనా గుప్తా. అనేక విజయవంతమైన చిత్రాల్లో తన యాక్టింగ్ పవర్ ఏంటో నిరూపించుకున్నది. వ్యక్తిగత జీవితంతోపాటు వృత్తి జీవితంలోనూ ఉన్నత స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఆరు పదుల వయసు దాటినా.. కుర్ర హీరోయిన్లకు తీసిపోకుండా గ్లామర్‌ను ప్రదర్శిస్తున్నది. ఆమె తాజాగా నటించిన ‘పంచాయత్ వెబ్ సిరీస్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది.