పంచభూతాల సాక్షిగా ప్రేమను జయించి తీరుతానంటున్నాడు విక్రమాదిత్య. అవరోధాల అగాధాల్ని దాటుకొని నచ్చిన నెచ్చెలితో కలిసి జీవిత పయనం సాగిస్తానని చెబుతున్న అతని కథేమిటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కె.కె.రాధాకృష్ణకుమార్. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘నీ రాతలే..దోబూచులే’ అనే వీడియోసాంగ్ను శుక్రవారం విడుదల చేశారు. ‘ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా..ఎవరో వీరెవరో విడిపోనీ యాత్రికులా..’ అనే పల్లవితో సాగిన ఈ గీతం ప్రేమికుల మనోభావాలకు, విధిపట్ల వారి విశ్వాసానికి అద్దం పడుతూ సాగింది. ఈ సినిమాలో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. సుందరమైన లొకేషన్లలో ఈ గీతాన్ని చిత్రీకరించారు. ఈ పాట చక్కటి హృదయానుభూతిని పంచుతుందని చిత్రబృందం తెలిపింది. పూజాహెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ఖేడ్కర్, ప్రియదర్శి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్పరమహంస, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, సమర్పణ: గోపీకృష్ణమూవీస్, నిర్మాణ సంస్థ: యూవీ క్రియేషన్స్, కథ, స్క్రీన్ప్లే, దర్శకుడు: కె.కె.రాధాకృష్ణకుమార్.