Salman Khan | రాజశ్రీ పాన్ మసాలా యాడ్ వివాదంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌పై జైపూర్ జిల్లా కన్స్యూమర్ ఫోరమ్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడంపై జాతీయ వినియోగదారుల కమిషన్ (NCDRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఆ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందా లేదా అనే ప్రాథమిక విషయాలను పరిశీలించకుండానే నటుడిపై వారెంట్లు ఎలా ఇస్తారని బెంచ్ ప్రశ్నించింది. ‘మిస్ లీడింగ్ అడ్వర్టైజ్మెంట్’కు, ‘సర్రోగేట్ (షాడో) మార్కెటింగ్’కు మధ్య ఉన్న తేడాను గుర్తించే కనీస ప్రయత్నం కూడా జిల్లా కమిషన్ చేయలేదని మండిపడింది. సల్మాన్ ఖాన్ సంతకాల నిజాయితీని తేల్చే ఫోరెన్సిక్ పరీక్షలపై అనవసరంగా దృష్టి మళ్లించడం కంటే, ఫిర్యాదులోని అసలు వాస్తవాలపై శ్రద్ధ పెట్టాల్సింది అని అభిప్రాయపడింది.
వివాదం ఏమిటంటే!
ఈ కేసు 2025లో లాయర్ యోగేంద్ర సింగ్ బడియాల్ దాఖలు చేసిన ఫిర్యాదుతో మొదలైంది. రాజశ్రీ పాన్ మసాలా యాడ్‌లో కుంకుమపువ్వు, యాలకులు ఉన్నట్లు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై జనవరి 6, 2026న జిల్లా కమిషన్ సల్మాన్ ఖాన్‌కు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత జనవరి 15న సల్మాన్ ఖాన్ తన లాయర్ ద్వారా కోర్టుకు హాజరై.. ఆ ప్రకటన కేవలం వెండి పూత పూసిన యాలకుల ప్రొడక్ట్‌కు సంబంధించిందని, అందులో పొగాకు, నికోటిన్ లేవని స్పష్టంగా వివరించారు. అయినప్పటికీ, మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయలేదనే కారణంతో జిల్లా కమిషన్ ఆయనపై వారెంట్లు జారీ చేయడమే కాకుండా, సమ్మన్లు పంపడానికి ఏకంగా ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
రాష్ట్ర కమిషన్ ఇందులో జోక్యం చేసుకోకపోవడంతో సల్మాన్ ఎన్‌సిడిఆర్‌సిని ఆశ్రయించారు. నటుడు ఇప్పటికే లాయర్ ద్వారా కోర్టుకు హాజరవుతున్నప్పుడు, సంతకాల వెరిఫికేషన్ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పెట్టడంలో జిల్లా కమిషన్ చూపించిన ఆత్రుత ఏంటో తమకు అర్థం కాలేదని ఎన్‌సిడిఆర్‌సి చురకలు అంటించింది. ప్రస్తుతం ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలను రాజస్థాన్ హైకోర్టు ఇప్పటికే నిలిపివేసినందున, హైకోర్టు తుది ఆదేశాలు వచ్చే వరకు వేచి చూడాలని జిల్లా కమిషన్‌ను ఆదేశిస్తూ ఎన్‌సిడిఆర్‌సి ఈ పిటిషన్‌ను ముగించింది.