బాలకృష్ణ సినిమా అంటే యాక్షన్, ఎమోషన్ కామన్.. వీటికితోడుగా పొలిటికల్ సీన్స్.. సెటైర్స్ కూడా తోడైతే ఇక చెప్పేదేముంది!? జనాల్లో చర్చలు.. వార్తా ఛానళ్లలో డిబేట్లు. ఇక ఆ రచ్చ మామూలుగా ఉండదు. ప్రస్తుతం కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఎన్బీకే 109’ వర్కింగ్ టైటిల్‌గా రూపొందుతున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను దర్శకుడు బాబీ అనంతపురంలో ప్లాన్ చేశాడు. ఈ నెల మూడోవారం నుంచి బాలయ్యపై అక్కడ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ చిత్రీకరించనున్నట్టు సమాచారం.
ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ అంతా అనంతపురంలోనే ఉంటుందని తెలుస్తున్నది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇది కేవలం యాక్షన్ డ్రామా మాత్రమే కాదని, కుటుంబనేపథ్యంలో సాగే భావోద్వేగ ప్రయాణమని సమాచారం. కథానుగుణంగా ద్వితీయార్థంలో పొలిటికల్ సన్నివేశాలు ఉంటాయని యూనిట్‌వర్గాల సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలావుంటే ఈ సినిమా తర్వాత బాలయ్య ‘అఖండ2’ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. దానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైందని తెలుస్తున్నది. బోయపాటి కథ కూడా సిద్ధం చేశారట. ఈ రెండోభాగం సోషియోఫాంటసీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. అయితే ‘అఖండ’ కథకూ, ‘అఖండ2’ కథకూ ఏదైనా సంబంధం ఉంటుందా? లేదా.. పూర్తిగా కొత్త కథతో రానుందా? అనేది తెలియాలి. వచ్చే ఏడాది ఆగస్ట్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నట్టు తెలుస్తున్నది.