Nayanthara | స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మూకుతి అమ్మన్ 2’ నుంచి దసరా పండుగ సందర్భంగా ఫ్యాన్స్‌కి శుభవార్త అందింది. ఈ సినిమాతో మళ్లీ అమ్మవారి రూపంలో నయనతార ఆకట్టుకోనుండగా, తాజాగా ఆమె లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా విడుదలైన పోస్టర్లో నయన్ చేతిలో త్రిశూలం పట్టుకుని, మెట్లపై శాంతంగా కూర్చున్న శాంతి స్వరూపిణిగా దర్శనమిచ్చారు. ఈ పోస్టర్‌కు “ఆమె దైవ కృప ప్రబలంగా ఉండనివ్వండి” అనే క్యాప్షన్ జత చేయడంతో, భక్తి భావంతో కూడిన ఈ లుక్ అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.2020లో వచ్చిన ‘మూకుతి అమ్మన్’ సినిమా తమిళంతో పాటు తెలుగులో విడుదలైంది. తెలుగులో ‘అమ్మోరు తల్లి’ గా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది.
తాజాగా రూపొందుతున్న సీక్వెల్ సినిమాను తెలుగులో ‘మహాశక్తి’ అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుందర్.సి మెగాఫోన్ పట్టగా, నయనతారతో పాటు రెజీనా కసాండ్రా, యోగి బాబు, దునియా విజయ్, ఊర్వశి, అభినయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సీక్వెల్‌కు మేకర్స్ భారీ బడ్జెట్ కేటాయించారు. దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, రౌడీ పిక్చర్స్, అవనీ సినిమాక్స్, IVY ఎంటర్టైన్మెంట్, B4U మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత డా. ఇషారి గణేష్ ఈ చిత్రానికి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
నయనతార ఇటీవలే బాలీవుడ్లో ‘జవాన్’ ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు దైవ పాత్రలో మరోసారి మాయ చేయనుంది. ‘మూకుతి అమ్మన్ 2’లో ఆమె పాత్రకు భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. పండగల సీజన్‌కి సరైన ఆధ్యాత్మిక థీమ్‌తో మేళవించిన ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. పవర్ఫుల్ కాన్సెప్ట్ – నయనతార మళ్లీ దేవతగా స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్న మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ నుండి నయనతార లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. శశిరేఖ పాత్రలో అద్భుతమైన లుక్‌తో దర్శనమిచ్చింది. పసుపు రంగు చీరలో గొడుగు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ శాంత స్వభావాన్ని ప్రతిబింబించేలా నయనతారను చూపించారు.