Nayanthara | దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార ఇటీవల విజయాల పరంపరను కొనసాగిస్తున్నా, వివాదాలు మాత్రం ఆమెను విడిచిపెట్టడం లేదు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన డాక్యుమెంటరీ ‘Nayanthara: Beyond the Fairytale’ మరోసారి లీగల్ చిక్కుల్లో పడింది. ఇప్పటికే ధనుష్ నుంచి లీగల్ నోటీసులు అందుకున్న ఈ డాక్యుమెంటరీకి ఇప్పుడు ‘చంద్రముఖి’ చిత్ర నిర్మాతల నుండి కూడా నోటీసులు రావడం గమనర్హం. 2005లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘చంద్రముఖి’ లో నయనతార హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె డాక్యుమెంటరీలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫుటేజ్‌లు వాడటం నిర్మాతలకి కోపం తెప్పించింది.
ఈ నేపథ్యంలో ‘ఏపీ ఇంటర్నేషనల్’ సంస్థ..నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కి మద్రాస్ హైకోర్టు ద్వారా లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ ఫుటేజ్ వినియోగానికి ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం తమ హక్కులకు భంగం కలిగిందని ఏపీ ఇంటర్నేషనల్ ఫిర్యాదులో పేర్కొంది. వారు డాక్యుమెంటరీ నుంచి ‘చంద్రముఖి’ క్లిప్పింగ్‌లను తొలగించడమే కాక, ₹5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఇదే డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజ్ వాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ చిత్ర నిర్మాత అయిన ధనుష్ ఇప్పటికే నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నోటీసు రావడంతో నయనతారకు ఇది రెండో లీగల్ షాక్.
2024లో నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదలైన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో ఆమె వ్యక్తిగత జీవితం, సినిమాల్లో ప్రవేశం, విజయాలు, విఘ్నేష్ శివన్ తో ప్రేమ, పెళ్లి, కవలల గురించి విపులంగా చూపించారు. ఇందులో భాగంగా పలు చిత్రాల ఫుటేజ్‌లను ఉపయోగించారు. వాటిలో ‘చంద్రముఖి’ భాగంగా ఉండటం ఇప్పుడు లీగల్ చిక్కుల్లో పడేలా చేసింది. ధనుష్ నోటీసులపై ఇప్పటివరకు నయనతార స్పందించలేదు. ఇప్పుడు మరో కేసుతో ఆమె ఎలా స్పందిస్తుందనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే విధంగా మరోసారి నెట్‌ఫ్లిక్స్ కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నయన్ డాక్యుమెంటరీపై లీగల్ దాడులు పెరుగుతున్న తరుణంలో, ఆమె భవిష్యత్ ప్రాజెక్టులకు ఈ వివాదాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నదే ఆసక్తికరంగా మారింది.