ఓటీటీ హిట్
నయనం
జీ5: స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్, అలీ రజా, ఉత్తేజ్, రేఖా నిరోషా, హరీష్ తదితరులు, దర్శకత్వం: స్వాతి ప్రకాశ్
మనిషి వేరు.. మనస్తత్వం వేరు. ఒక వ్యక్తి.. బయటికి కనిపించే స్వభావానికి, అతని మనసు లోతుల్లోని భావానికి ఎంతో తేడా కనిపిస్తుంది. అలా.. మనుషులు-మనస్తత్వాల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొందాయి. అయితే, ఆ జానర్‌కు సస్పెన్స్‌ను కూడా జోడిస్తూ తెలుగులో తెరకెక్కిన వెబ్ సిరీస్.. నయనం. వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో, ఆరు ఎపిసోడ్స్‌గా వచ్చిన ‘నయనం’ ఇటీవలే జీ5 వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది.
కథలోకి తొంగి చూస్తే.. నయన్ (వరుణ్ సందేశ్)కు చిన్నప్పటినుంచే ఇతరుల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడం అంటే ఆసక్తి. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్న టీచర్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని.. నేత్ర వైద్యుడు అవుతాడు. అయితే, ఇతరుల జీవితాలపై నిఘా పెట్టాలనే తనకున్న ఆసక్తితో.. సొంతంగా క్లీనిక్ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో కంటి సాయంతో ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేలా రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. తన దగ్గరికి వచ్చిన పేషెంట్ల కంట్లోకి ఒక రకమైన ఇంజెక్షన్ ఇస్తుంటాడు.
అలా 12 గంటల్లో నాలుగు నిమిషాల పాటు వారు ఏం చేసినా తన దగ్గరున్న ప్రత్యేక కళ్లజోడు ద్వారా చూస్తుంటాడు. ఈ క్రమంలోనే మధ్య వయస్కుడైన టీచర్‌ను వివాహం చేసుకున్న యువతి మాధవి (ప్రియాంక జైన్).. కంటి సమస్యతో నయన్ దగ్గరికి వస్తుంది. ఆమెకు ఇంజక్షన్ ఇచ్చిన నయన్.. మాధవి తన భర్త గౌరీ శంకర్ (ఉత్తేజ్)ను హత్య చేయడం చూస్తాడు. దాంతో ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. అయితే, మాధవి తన భర్తను ఎందుకు హత్య చేస్తుంది? హత్యను చూసిన నయన్.. ఆ విషయాన్ని పోలీసులకు చెబుతాడా? ఇన్వెస్టిగేషన్ చేపట్టిన సీఐ (అలీ రజా).. ఈ హత్య కేసును ఎలా ఛేదిస్తాడు? అనేది మిగతా కథ.