Anaganaga Oka Raju Trailer | టాలీవుడ్ నటుడు నవీన్ పొలిశెట్టి తన కామెడీతో మరోసారి థియేటర్లలో నవ్వుల జాతర సృష్టించడానికి సిద్ధమయ్యారు. సంక్రాంతి రేసులో నిలిచిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘అనగనగా ఒక రాజు’ థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం నేడు (జనవరి 8న) అత్యంత గ్రాండ్‌గా విడుదల చేసింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ ట్రైలర్ చూస్తుంటే నవీన్ పొలిశెట్టి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన కామెడీ పవర్‌ను పక్కాగా చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా కింగ్ అక్కినేని నాగార్జున ఈ ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ అందించడం ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి. రాజు గారి కోసం బంగార్రాజు రంగంలోకి దిగారు అన్నట్లుగా సాగిన ఆయన బేస్ వాయిస్ ట్రైలర్‌కు మరింత జోష్‌ను అదనపు ఆకర్షణను ఇచ్చింది. గోదావరి జిల్లా నేపథ్యంలో, పెళ్లి చుట్టూ తిరిగే గందరగోళం మరియు హుషారైన డైలాగ్స్‌తో ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. ఇందులో నవీన్ ఎనర్జీకి తోడు, హీరోయిన్ మీనాక్షి చౌదరి అందం కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
మరోవైపు ఈ ఏడాది సంక్రాంతి పోటీ అత్యంత రసవత్తరంగా ఉండబోతుంది. ప్రభాస్ ‘ది రాజా సాబ్’, చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి భారీ చిత్రాల మధ్య జనవరి 14న ‘అనగనగా ఒక రాజు’ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ‘జాతి రత్నాలు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నవీన్ చేస్తున్న ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై గట్టి నమ్మకం ఉంది. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాయి.