‘సినిమా కోసం నవీన్ ప్రాణం పెడతాడు. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుందనడానికి ఈ సినిమా విజయయే ఓ ఉదాహరణ’ అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. శుక్రవారం జరిగిన ‘అనగనగా ఒక రాజు’ చిత్ర విజయోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహించారు.
సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ..ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి వన్‌మ్యాన్‌షో చేశారని, ప్రివ్యూ చూసినప్పుడే ఈ సినిమా విజయం ఖాయమనే నమ్మకం కలిగిందని అన్నారు. సినిమాను ఎంత ప్రేమిస్తే అంతటి విజయం లభిస్తుందని, ఇది నిర్మాత వంశీ విషయంలో నిజమవుతున్నదని దిల్‌రాజు చెప్పారు.
డిస్ట్రిబ్యూటర్లు తమకు లాభాలొచ్చాయని చెప్పడమే నిర్మాతకు పెద్ద విజయమని నిర్మాత నాగవంశీ తెలిపారు. ఈ సంక్రాంతి ఎప్పటికీ గుర్తుండిపోతుందని, పెద్ద సినిమాలతో నిలబడి ఈ సినిమా విజయం సాధించడానికి కారణం తెలుగు ప్రేక్షకుల ప్రేమేనని హీరో నవీన్ పొలిశెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత చంద్రబోస్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.