Naveen Chandra | ‘నా ప్రతీ సినిమాకు పదిమంది ఆడియెన్స్ అయినా పెరగాలి. అదే లక్ష్యంతో విభిన్న పాత్రల్ని ఎంచుకుంటున్నా. దక్షిణాది అన్ని భాషల్లో మంచి ఆఫర్లొస్తున్నాయి’ అన్నారు హీరో నవీన్‌చంద్ర. ఆయన నటించిన తాజా చిత్రం ‘లెవన్’ ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. లోకేష్ అజ్ల్స్ దర్శకుడు. అజ్మల్‌ఖాన్, రేయా హరి నిర్మాతలు. ఈ సందర్భంగా బుధవారం నవీన్‌చంద్ర విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా రూపొందించామని, తమిళంలో వేసిన ప్రీమియర్షోస్కు అద్భుతమైన స్పందన లభించిందని, ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇప్పటివరకు ఈ తరహా థ్రిల్లర్ రాలేదు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ప్రతీ సంఘటనకు లాజిల్ ఉంటుంది. కథలోని మలుపులను ఎవరూ ఊహించలేరు. రెండు భాషల్లో డిఫరెంట్ షాట్స్‌తో సినిమా తీశాం’ అని నవీన్‌చంద్ర తెలిపారు. ఈ సినిమా తమిళ వెర్షన్‌కు డబ్బింగ్ తానే చెప్పానని, దక్షిణాది నాలుగు భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలనన్నారు.
తాను నటిస్తున్న తాజా చిత్రాల వివరాలను తెలియజేస్తూ ‘రవితేజ ‘మాస్ జాతర’ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నా. నన్ను రవితేజగారే రిఫర్ చేశారు. ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నా పాత్రను ఎంత యూనిక్‌గా ఫీలయ్యారో అదే రీతిలో ‘మాస్ జాతర’లోని పాత్ర మెప్పిస్తుంది. కరుణకుమార్ దర్శకత్వంలో ‘హనీ’ అనే డార్క్ కామెడీ సినిమా చేస్తున్నా. అలాగే ‘కాళీ’ అనే యాక్షన్ మూవీలో నటిస్తున్నా. హరి అనే దర్శకుడితో ఓ కామెడీ సినిమా చేస్తున్నా. కెరీర్లో తొలిసారి కామెడీ చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు.