‘మెడికోలైన కార్తీక్, అంజలి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ డాక్టర్లుగా సెటిల్ అవుతారు. అయితే అంజలి అనుకోకుండా అనారోగ్యపాలవుతుంది. ఆమెను 28 డిగ్రీ టెంపరేచర్లోనే చూసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కథ సాగుతుంది. మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా శారీరక సమస్య ఉంటే మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తాం. ఈ కథలోని ఆ ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్సే అద్భుతంగా అనిపించాయి.
అరేండ్ల క్రితం ఓ రెస్టారెంట్లో దర్శకుడు డా.అనిల్విశ్వనాథ్ ఈ కథ గురించి చెప్పారు. కథ ఆసాంతం విన్నాక, యూనిక్‌గా అనిపించింది. షూటింగ్ ఫస్ట్‌డేనే అర్థమైపోయింది.. దర్శకుడు అనిల్ కచ్చితంగా సినిమాను బాగా తీయగలడని.’ అని హీరో నవీన్‌చంద్ర అన్నారు. ఆయన హీరోగా, నటించిన చిత్రం ‘28 డిగ్రీస్ సెల్సియస్’.
‘మా ఊరి పొలిమేర’ఫేం డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. సాయి అభిషేక్ నిర్మాత. నేడే సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం నవీన్‌చంద్ర విలేకరులతో మాట్లాడారు. ‘ ఓ బుక్‌లో ఉన్న థియరీని తీసుకొని దాన్ని సినిమాటిక్‌గా మలిచారు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. వైజాగ్, జార్జియా.. ఈ రెండు ప్రాంతాల్లో ఈ కథ జరుగుతుంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చేసిన సినిమా ఇది. తప్పకుండా ఆడియన్స్ ఆదరిస్తారని నమ్మకం ఉంది.’ అని ఆశాభావం వ్యక్తం చేశారు నవీన్‌చంద్ర