Jani Master | కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు (Jani Master) ప్రకటించిన జాతీయ అవార్డును నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ తాత్కాలికంగా నిలిపివేసింది. 2022 ఏడాదికిగాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీమాస్టర్ ఎంపికయ్యారు. ఈ నెల 8న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో పురస్కారం అందుకోవాల్సి ఉంది. అయితే తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఆయనపై గత నెలలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదుచేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ నేపథ్యంలో జానీమాస్టర్‌కు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, ఇన్విటేషన్‌ను రద్దు చేస్తున్నట్లు సెల్ పేర్కొంది. అవార్డు ప్రోగ్రామ్‌కు వెళ్లేందుకు జానీమాస్టర్‌కు ఈ నెల 6 నుంచి 9 వరకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన నేడు విడుదలయ్యే అవకాశం ఉంది.
కాగా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్‌ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గోవాలో జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గా ల వాదనలూ విన్న న్యాయమూర్తి.. అక్టోబరు 3 వరకు (14 రోజుల) రిమాండ్ విధించారు.