71వ జాతీయ అవార్డ్స్‌లో ‘బేబీ’ సినిమా రెండు కేటగిరీల్లో అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా చిత్ర దర్శకుడు సాయిరాజేష్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా పీవీఎన్ఎస్ రోహిత్ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయ సమావేశం నిర్వహించిన ‘బేబీ’ టీమ్.. తమ చిత్రానికి జాతీయ స్థాయి గౌరవం లభించడం పట్ల సంతోషం వెలిబుచ్చింది. ‘ఈ సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు ఓ మూడ్‌లో ఉండిపోయేవాడ్ని. రెండేళ్లు ఈ కథ నా మనసులో ఉండిపోయింది. ఈ సినిమా స్క్రీన్‌ప్లేకు జాతీయ అవార్డు వచ్చిందని తెలిసి, చెప్పలేనంత ఆనందం కలిగింది.
‘బేబీ’ ఇంత హార్ట్ టచింగ్‌గా రావడానికి ‘ప్రేమిస్తున్నా..’ పాట కూడా ఓ కారణం. ఆ పాట పాడిన రోహిత్‌కు కూడా నేషనల్ అవార్డు రావడం సంతోషం అనిపించింది. నన్ను ఎవరూ నమ్మని రోజు నిర్మాత ఎస్కేఎన్ నమ్మాడు. ఈ గౌరవంలో ఆయనకూ భాగం ఉంది.’ అని దర్శకుడు సాయిరాజేష్ అన్నారు.
తన కెరీర్‌ని మలుపు తిప్పిన పాట ‘ప్రేమిస్తున్నా..’ అని. అ పాటే తనను జాతీయ స్థాయిలో బెస్ట్ సింగర్‌గా నిలబెట్టడం నిజంగా యాదృశ్చికమని గాయకుడు పీవీఎన్ఎస్ రోహిత్ పేర్కొన్నారు. ఇంకా హీరోహీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని, గేయ రచయిత సురేష్ బనిశెట్టి, ఎడిటర్ విప్లవ్ కూడా మాట్లాడారు.