ఏడాదిన్నర క్రితం వచ్చిన ‘మ్యాడ్’ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంది. దాంతో సీక్వెల్‌గా వస్తున్న ‘మ్యాడ్ స్కేర్’పై భారీ అంచనాలేర్పడ్డాయి. సంగీత్శోభన్, నార్నే నితిన్, రామ్‌నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రల్లో కల్యాణ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
నలుగురు మిత్రుల్లో ఒకరైన లడ్డు (విష్ణు) పెళ్లిసందడితో మొదలైన ట్రైలర్ ఆద్యంతం నవ్వుల్ని పంచింది. మిత్రబృందం గోవా టూర్, అక్కడ చోటుచేసుకునే సరదా సంఘటనల నేపథ్యంలో ట్రైలర్ ఆసాంతం మెప్పించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ..సంపూర్ణ హాస్యభరిత చిత్రమిదని, కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుందని చెప్పారు.
ప్రేక్షకులు తాము పెట్టిన ప్రతీపైసాకు డబుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీగా పొందుతారని సూర్యదేవర నాగవంశీ అన్నారు. ‘మ్యాడ్’కు మించిన రెట్టింపు వినోదం ఉంటుందని, ట్రైలర్ తరహాలోనే సినిమా ఆద్యంతం చక్కటి కామెడీ, పంచ్‌డైలాగ్‌లతో సరదాగా సాగుతుందని ప్రధాన పాత్రధారులు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్, సమర్పణ: సూర్యదేవర నాగవంశీ, నిర్మాతలు: హారిక, సాయిసౌజన్య, దర్శకత్వం: కల్యాణ్‌శంకర్.