Naresh | తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ చుట్టూ నెలకొన్న వివాదం రోజురోజుకు పెద్దదవుతోంది. ప్రముఖ నటుడు ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్గా దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత బన్నీ వాస్‌తో పాటు సుకుమార్ సతీమణి తబిత నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం విడుదలకు ముందే టైటిల్ కారణంగా చర్చనీయాంశంగా మారింది. ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్ ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు నెటిజన్లు ఈ పదానికి అర్థం తెలియడం లేదని, సినిమాకు సబ్‌టైటిల్స్ అవసరమవుతాయని కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఈ వ్యాఖ్యలు క్రమంగా ప్రాంతీయ మాండలికాల చర్చకు దారి తీసి, సోషల్ మీడియాలో ‘ఆంధ్ర వర్సెస్ తెలంగాణ’ తరహా వాదనలకు కారణమయ్యాయి.
ఒక నెటిజన్ చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారంలో రాజకీయ వ్యాఖ్యలు కూడా చోటుచేసుకోవడంతో విషయం మరింత చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ స్పందించారు. ఒక సినిమా టైటిల్‌ను ఇంత పెద్ద అంశంగా మార్చడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ, రాయలసీమ, కోనసీమ, ఉత్తరాంధ్ర.. ఏ ప్రాంతపు మాండలికమైనా తెలుగు భాష గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. మన సొంత భాషను, మాండలికాలను మనమే కించపరచుకోవడం తెలుగువారిగా సిగ్గుపడాల్సిన విషయం అని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషలోని ప్రతి ప్రాంతీయ పదం కూడా మన సంస్కృతిలో భాగమని, వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.
సినిమాను సినిమాగానే చూడాలని నరేష్ సూచించారు. ఇతర భాషల చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.‘కాంతార’, ‘కరుప్పు’ వంటి టైటిళ్లకు చాలామందికి అర్థం తెలియకపోయినా ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. భాషను అడ్డంకిగా చూడకుండా మంచి కథలను స్వాగతించారు. అలాంటప్పుడు మన తెలుగు భాషలోని ఒక ప్రాంతీయ పదాన్ని టైటిల్‌గా పెట్టినందుకు వివాదం సృష్టించడం సరైంది కాదు అని ఆయన పేర్కొన్నారు. ‘ఇడుపు కాయితం’ వివాదానికి త్వరగా ముగింపు పలకాలని నరేష్ కోరారు. తెలుగు భాషా సంఘాలు, సాంస్కృతిక సంస్థలు ఈ అంశంపై చర్చించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వాలు, మీడియా, నెటిజన్లు అందరూ కలిసి భాషా వైవిధ్యాన్ని గౌరవించాలి. మన భాషను మనమే అవమానించుకుంటే నష్టపోయేది మనమే. ప్రాంతీయ మాండలికాలు తెలుగు భాషకు ఆభరణాలు అని ఆయన అన్నారు.