Naresh | సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు నరేష్ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి నటనతో కాక, తన అభిరుచి మేరకు నిర్మించుకున్న విలాసవంతమైన ఇంటి కారణంగా. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఏకంగా ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్వగృహం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల నరేష్ – పవిత్ర లోకేష్ జంట వారి కొత్త ఇంటి గ్రాండ్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటులు మురళీమోహన్, అలీతో పాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు. నరేష్ ఆధ్వర్యంలో అతిథులకి ఘనంగా ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్బంగా ఇంట్లోకి ఎంట్రీ మొదలుకొని మాస్టర్ బెడ్రూమ్స్, కిచెన్, జిమ్, వరండాలు, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్ వరకు అన్నీ సందర్శకుల్ని ఎంతగానో మెప్పించాయి.
నరేష్ తన ఇంటిని అత్యంత విశిష్టంగా తీర్చిదిద్దించుకున్నాడు. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన వరండాలో ఉన్న భారీ వరల్డ్ మ్యాప్ మరింత ఆకర్షణగా నిలుస్తోంది. ఇది నరేష్ గ్లోబల్ దృష్టిని ప్రతిబింబించే అంశంగా మారింది. ఈ ఇంటి లాంచింగ్ అనంతరం నరేష్ ఆస్తుల విలువపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. దివంగత విజయనిర్మలకు ఏకైక వారసుడిగా ఉన్న నరేష్‌కు భూసంపదతో పాటు, సినీ పరిశ్రమలో తన సుదీర్ఘ ప్రయాణంలో కూడగట్టిన సంపద మొత్తం కలిసి ఆయన ఆస్తుల విలువ రూ. 400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. గచ్చిబౌలి సమీపంలోని విప్రో సర్కిల్ వద్ద విజయనిర్మలకి సంబంధించి న ఐదు ఎకరాల ఫామ్ హౌస్ విలువ ఏకంగా రూ. 300 కోట్లు అని సమాచారం. అలాగే మొయినాబాద్, శంకరపల్లి పరిసరాల్లో మరో 30 ఎకరాల ఫామ్ ల్యాండ్స్ ఉండగా, వాటి విలువ కూడా రూ. 100 కోట్లకు పైగా ఉంటుంది.
తన నూతన గృహాన్ని పూర్తిగా ఇంద్ర భవనాన్ని తలపించేలా డిజైన్ చేయించుకున్న నరేష్, అందులో తన జీవితప్రస్థానాన్ని ప్రతిబింబించే అంశాలను జోడించాడు. ఇది కేవలం ఇల్లు కాదు, నరేష్ జీవన శైలిని, అభిరుచిని తెలిపే ఒక కళాఖండంగా మారింది.ఈ ఇంటి విలువ కోట్లలోనే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం నరేష్ కొత్త ఇంటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆయన అభిమానులను, సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.