‘గుర్రం పాపిరెడ్డి’ చిత్రంలో తాను ప్రేక్షకులకు కథను తెలియజెప్పే జడ్జి పాత్రలో నటించానని, ఇదొక విభిన్న కథా చిత్రమని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. డార్క్ కామెడీతో రూపొందిన ‘గుర్రం పాపిరెడ్డి’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. నరేష్ ఆగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్ దర్శకత్వంలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ నిర్మించారు.
మంగళవారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. కొత్త నిర్మాతలు తీసిన ఇలాంటి చిత్రాల్ని ఆదరిస్తే భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మన నేటివిటీ పరిధిలోనే తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా సినిమాను చూపించే ప్రయత్నం చేశామని దర్శకుడు తెలిపారు.
ఈ సినిమాలో తాను సౌధామినిగా విభిన్న పాత్రలో కనిపిస్తానని కథానాయిక ఫరియా అబ్దుల్లా చెప్పింది. ఇందులో తాను నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తానని హీరో నరేష్ అగస్త్య పేర్కొన్నారు. తెలుగులో ఇప్పటివరకూ రాని డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదని, గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.