Narendra Modi | భారతీయ సంగీత ప్రపంచంలో మరో ధృవతార అస్తమించింది. తన మధుర గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది సంగీతాభిమానులను అలరించిన లెజెండరీ గాయని ఆశా భోస్లే (92) ఏప్రిల్ 12, 2026న ముంబైలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గుండెపోటు, బహుళ అవయవాల వైఫల్యం ఆమె మరణానికి కారణమని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆమె మృతిపై దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం వ్యక్తమవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాప సందేశంలో ఆశా భోస్లేను భారతదేశపు అత్యంత బహుముఖ గాయనీమణులలో ఒకరుగా కొనియాడారు. ఆమె స్వరం కాలాతీతమైనది.
భారతీయ సంస్కృతికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయాలు అంటూ ఆయన నివాళులర్పించారు. సోషల్ మీడియా ద్వారా ఆమెతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటూ సానుభూతి తెలిపారు .ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె స్వరం ప్రజల జీవితాల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది అంటూ పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇక 1933లో మంగేష్కర్ కుటుంబంలో జన్మించిన ఆశా భోస్లే, చిన్న వయస్సులోనే సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు నిరంతరాయంగా సాగిన ఆమె గాన ప్రయాణం భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. 20కి పైగా భాషల్లో 12 వేలకుపైగా పాటలు పాడి, ప్రపంచంలోనే అత్యధిక పాటలు రికార్డ్ చేసిన గాయనిగా గుర్తింపు పొందారు.
ఆమె గాన వైవిధ్యం అసాధారణం. మెలోడీ పాటలు, ఉత్సాహభరితమైన డ్యాన్స్ నంబర్స్, గజల్స్, భజనలు ఏ జానర్ అయినా ఆమె స్వరంలో ప్రత్యేక మాధుర్యం కనిపించేది. ముఖ్యంగా ఉమ్రావ్ జాన్, ఇజాజత్ వంటి చిత్రాల్లో ఆమె ఆలపించిన గజల్స్ సంగీత ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. ఆమె సోదరి, గానకోకిల లతా మంగేష్కర్ తర్వాత భారతీయ సంగీత సామ్రాజ్యంలో అదే స్థాయి గౌరవాన్ని పొందిన గాయని ఆశా భోస్లే. సంగీత రంగానికి చేసిన అపార సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను ‘పద్మ విభూషణ్’, ‘దాదాసాహెబ్ ఫాల్కే’ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలతో సత్కరించింది. అలాగే రెండు జాతీయ అవార్డులు, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె మరణంతో టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ సంగీత ప్రపంచం కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆమె పాటలను గుర్తుచేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు.