Nara Rohit – Siri Lella | టాలీవుడ్ నటుడు నారా రోహిత్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. హీరోయిన్ శిరీష (సిరి లేళ్ల) తో ఆయన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించనున్నారు. ఈ జంట ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు వారి వెడ్డింగ్ డేట్ కూడా ఖరారైంది. సమాచారం ప్రకారం, నారా రోహిత్ – శిరీష వివాహ వేడుకలు హైదరాబాద్‌లో ఐదు రోజులపాటు భారీగా జరగనున్నాయి. ఈ నెల అక్టోబర్ 25న హల్దీ వేడుకతో వివాహ సంబరాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 26న పెళ్లికొడుకు చేసే కార్యక్రమం, అక్టోబర్ 28న మెహందీ, అక్టోబర్ 29న సంగీత్ నైట్ నిర్వహించనున్నారు. ముఖ్య వేడుక అయిన పెళ్లి అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు జరుగనుంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. ఇప్పటికే వివాహ ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
ఇటీవల శిరీష ఇంట్లో ‘పసుపు దంచే’ కార్యక్రమం జరగగా, ఆ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతకముందు ఎంగేజ్మెంట్కి ఏడాది పూర్తైన సందర్భంగా కూడా శిరీష ఇన్‌స్టాగ్రామ్‌లో జంట ఫోటోలు పోస్ట్ చేశారు. ఇక నారా రోహిత్ మరియు శిరీష కలిసి ‘ప్రతినిధి 2’ సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని టాలీవుడ్ టాక్. గతేడాది అక్టోబర్‌లో ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుంది. ఆ వేడుకకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు హాజరై ఆశీర్వదించారు.ఇప్పుడు రోహిత్ – శిరీష అక్టోబర్ 30న వివాహ బంధంలో అడుగుపెట్టబోతుండటంతో, నారా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది.
నిజానికి గత ఏడాది వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణం వల్ల ఏడాది పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడు, యువ కథానాయకుడు నారా రోహిత్ కావడంతో ఈయన పెళ్లి వేడుకకి భారీగానే ప్రముఖులు హాజరు అయ్యే అవకాశం ఉంది.