Nara Rohit | టాలీవుడ్ నటుడు నారా రోహిత్ గత ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన ప్రియురాలు శిరీషతో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కన్వెన్షన్ సెంటర్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఆనందోత్సాహాలతో నిండిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్‌తో పాటు నారా కుటుంబానికి చెందిన పెద్ద సంఖ్యలో బంధువులు ఈ వేడుకలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అయితే నారా రోహిత్ తన పెళ్లి ఫొటోలని కొద్ది రోజుల క్రితం షేర్ చేయగా, ఇప్పుడు వీడియోని షేర్ చేశాడు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవడంతో పాటు నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుంది. ఇక నారా కుటుంబానికి చెందిన యువ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్, రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ పూర్తిగా సినిమాలపై ఆసక్తితో తన ప్రయాణాన్ని కొనసాగించారు. చంద్రబాబు నాయుడి సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడైన రోహిత్, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొందిన తర్వాత 2009లో ‘బాణం’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఆపై సోలో, ప్రతినిధి, అసుర, రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడుండేవాడు, జో అచ్యుతానంద వంటి విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నారు.
ఈ మధ్య భైరవం, సుందరకాండ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. రోహిత్ జీవిత భాగస్వామిగా మారిన శిరీష ‘ప్రతినిధి 2’ చిత్రంలో హీరోయిన్గా నటించారు. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. పెద్దల సమ్మతితో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే ఆ తర్వాత రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో మృతి చెందడంతో వివాహం కొంతకాలం వాయిదా పడింది. అన్ని పరిస్థితులు అనుకూలించడంతో అక్టోబర్ 30,2025 రాత్రి వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలో నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పెద్దలుగా వ్యవహరించి సంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలను దగ్గరుండి నిర్వహించారు.