‘నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన చిత్రమిది. ఈ సినిమా విషయంలో పూర్తి సంతృప్తితో ఉన్నా. ఒక సినిమా వెనక ఎంతోమంది కష్టం ఉంది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి నచ్చితేనే సపోర్ట్ చేయండి. నచ్చకపోతే మీకు నచ్చింది రాయండి. మీరందరూ థియేటర్లో సినిమాను ఎంజాయ్ చేస్తారని గ్యారంటీ ఇస్తున్నా’ అన్నారు నారా రోహిత్. ఆయన కథానాయకుడిగా నటించిన 20వ చిత్రం ‘సుందరకాండ’ నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్‌రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాతలు. సోమవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా రోహిత్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. వినూత్నమైన కథాంశంతో, ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల కలబోతగా ఈ చిత్రాన్ని తీశామని, తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు.
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చక్కటి వినోదంతో మెప్పించే సినిమా ఇదని దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి పేర్కొన్నారు. నారా రోహిత్ ఎంచుకునే కథల్లో కొత్తదనం ఉంటుందని, ఈ సినిమాలో కూడా ఇప్పటివరకూ టచ్ చేయని ఓ కొత్త పాయింట్‌ను చర్చించామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్, కథానాయిక శ్రీదేవి, వృత్తి వాఘని తదితరులు పాల్గొన్నారు.