Nani | చిరంజీవి, రవితేజల తర్వాత ఇండస్ట్రీలో కష్టంతో పైకొచ్చిన హీరోలలో నాని తప్పక ఉంటారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని కూడా చాలా మందికి స్పూర్తి. ఆయన కెరియర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైంది. ఇప్పుడు స్టార్ హీరోగా, సక్సెస్ ఫుల్ నిర్మాతగా కూడా దూసుకుపోతున్నారు. ఇప్పుడు తన నిర్మాణంలో రూపొందిస్తున్న సినిమాల కోసం కొత్త టాలెంట్‌ని ప్రోత్సహిస్తున్నారు నాని . రీసెంట్గా నాని నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా కొత్త డైరెక్టర్ రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్ సినిమా విడుదలైంది. మార్చ్ 14 రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్న నాని రెండు రోజుల ముందు నుంచే ప్రీమియర్లు వేశారు. కోర్ట్ సినిమాకు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ రాగా, మొదటి రోజు, ప్రీమియర్స్ కలుపుకొని కోర్ట్ సినిమా 8.10 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇందులో పోక్సో యాక్ట్ గురించి చర్చించారు. భారతదేశంలో 18 ఏళ్ళ కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి ఉద్దేశించిన ఈ చట్టాన్ని కొందరు వ్యక్తులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనేది ఈ సినిమాలో చూపించి ఆడియన్స్‌ని ఆకర్షించారు. ‘కోర్ట్’ సిరీస్ లో మరికొన్ని సినిమాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అయితే కోర్ట్ సినిమా ఓ ప్రీమియర్ షో హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో వేశారు. ఆ రోజు నాని కోర్ట్ సినిమా ప్రదర్శన జరుగుతున్నంత సేపు థియేటర్లో వెనక నిల్చొనే చూసాడు నాని . దాదాపు రెండున్నర గంటలు నాని నిల్చొనే సినిమా చూడగా, ఆయనతో పాటు హీరో ప్రియదర్శి కూడా నిల్చున్నాడు. ఎందుకు అంత సేపు నిల్చొని చూడటం అని కొంతమంది ఆలోచిస్తున్నారు. అయితే దీనిపై దర్శకుడు శివ నిర్వాణ గతంలో క్లారిటీ ఇచ్చాడు. ఎంతమంది కూర్చోమని అడిగినా మొదటి షో నాని నిల్చొనే చూస్తాడు. సినిమాలో వచ్చే సీన్స్ కి ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏ సీన్ కి ప్రేక్షకులు ఎలాంటి మూమెంట్స్ ఇస్తున్నారు అని ప్రతిదీ చూస్తారు. సినిమాని ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని చూసి తెలుసుకుంటారు. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి నాని ఆనందిస్తారు. ప్రేక్షకులు సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు తెలుసుకోవడానికే నాని నిల్చొని సినిమా చూస్తాడు అని తెలిపాడు.